Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు చా‌‌ళుక్యుడే యైనయెడల దేశపరిపాలనము సేయురాజకుటుంబములోని వాడుగాక మఱియొక సామంతరాజ కుటుంబములోని వాడైయుండవలయును. ఇతడు చాళుక్యడుకాని యెడల చాళుక్యులీదేశ మాక్రమించుకొనుటకు బూర్వము పరిపాలనము సేయుచుండిన పల్లవవంశములోని వాడుగాని గాంగవంశములోని వాడుగానియై యుండవలయును. అట్లుతలంచుటకును దృప్తికరమైన సాక్ష్యమునుగానరాదు. తొమ్మిదవశతాబ్దమధ్యము నందుండిన గణకవిజయాదిత్యుడను చాళుక్యరాజు తనశత్రువగు నొకమంగిరాజును సంహరించి నట్లొకశాసనమన జెప్పబడినది. ఆ మంగిరాజితని వంశములోని వాడని యూహింపదగియున్నది.

మూడవ విష్ణువర్ధనుడు.

(క్రీ.శ. 709 మొదలుకొని 746 వఱకు)

ఇతడు కొక్కిలికి అనగా విక్రమాదిత్య భట్టారకునకు జ్యైష్ఠభ్రాత. రెండవ జయసింహునికి సవతితమ్ముడు. జయసింహుని మరణానంతరము రాజ్యమునక్రమముగా నాక్రమించుకొనిన తమ్ముని సింహాసన విహీనుని జేసి రాజ్యమాక్రమించుకొని 709 మొదలుకొని 746 వఱకును ముప్పదియేడుసంవత్సరములు నిరంకుశముగా దేశమును బరిపాలించెను. ఇతడన్ని శాసనములందును విష్ణువర్ధనుడని పేర్కొనబడియుండగా నొకశాసనమునందు విష్ణురాజని పేర్కొనబడియెను.

విజయాదిత్య భట్టారకుడు.

(క్రీ.శ. 746మొదలుకొని 764 వఱకు.)

ఇతడు మూడవవిష్ణువర్ధనుని కుమారుడు. విజయాదిత్య నామమును వహించిన పూర్వచాళుక్యలలో మొదటివాడుగ నుండెను. ఈ విజయాదిత్య భట్టారక మహారాజునకు విజయసిద్ధి, విక్రమరాముడని బిరుదములుగలవు. ఇతడు 746మొదలుకొని 764 వఱకును పదునెనిమిది సంవత్సరములు వేంగిదేశమును బరిపాలించి ఖ్యాతిగాంచెను. వీనితరువాత వీనికుమారుడు రాజ్యమునకు వచ్చెను.