రంభించిరి. ఈ రాజద్రోహులకు నధిరాజేంద్రవర్మ నాయకుడుగా నుండెనని ప్రభాకరమహారాజుకుమారుడగు పృథ్వీమూలుని యొక్క గోదావరిమండలశాసనము దెలుపుచున్నది. [1] అధిరాజేంద్రుడు కళింగనగరమును రాజధానిగ నుత్తరకళింగమును నేలుచుండుగాంగవంశజుడయిన యింద్రవర్మ మహారాజేగాని యన్యుడు గాడు. [2] వీని రాజ్యము చాళుక్యరాజ్యమునకు నుత్తరమున నున్నది. ఆ రాజులతో జరిగిన యుద్ధములో నింద్రభట్టారకుడు మృతినొందియుండును. ఆ కారణము చేత నాతని రాజ్యపరిపాలన మేడుదినములలోనే ముగిసిపోయినది.
రెండవ విష్ణువర్ధనుడు.
ఇంద్రభట్టారకుని మరణానంతరము వానికొడుకు విష్ణువర్ధనుడు సింహాసనమెక్కెను. ఇతడు శత్రురాజులను జయించి సర్వలోకాశ్రయుడనియు, విషమసిద్ధియనియు బిరుద పేళ్లువహించెను. ఇతడు తొమ్మిదిసంవత్సరములు నిరంకుశముగ బరిపాలనము చేసెను. ఈ సర్వలోకాశ్రయుడయిన రెండవవిష్ణువర్ధన మహారాజు చేసినయొక దానశాసనమునందు "ఆత్మవిజయరాజ్యపంచమే సంవత్సర ఫాల్గుణమాసే అమవాస్యా సూర్యగ్రహణ నిమిత్తం" అని శకసంవత్సరము 570 ఫాల్గుణబహుళామావాశ్యకు సరియైన 669వసంవత్సరము ఫిభ్రవరినెల 17తేది వీనిరాజ్యకాలములో నైదవయేడని చెప్పబడియుండుటచేత వీనిరాజ్యపాలనము 663వ సంవత్సరము ఫాల్గుణబహుళములో బ్రారంభమైనదని చెప్పవచ్చును. వీనిపేరుగల శాసనములు రెండుగానవచ్చుచున్నవి. అందొకటినెల్లూరు మండలములో నెచ్చటనోగాన్పించినది. కర్మరాష్ట్రములోని రేయూరు గ్రామము దానముచేయబడినట్లుగ దెలిపెడి శాసనమైయున్నది. కర్మ (కమ్మ)రాష్ట్రము ప్రస్తుత గుంటూరు మండలములోనిదని యిదివఱకె తెలిపియుంటిమి. ఈ శాసనము వీనిపరిపాలనము యొక్క రెండవసంవత్సరమున చైత్రశుద్ధదశమి బు