పుట:Andhrula Charitramu Part-1.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీపులకేశి వల్లభ మహారాజనునది వీని సంపూర్ణమైన బిరుదనామముగానున్నది. వీనికుమారుడు కీర్తివర్మ మహీపాలుడుగానుండెను.

శ్రీకీర్తివర్మవల్లభ మహారాజు .

ఇతడుత్తర కొంకణమును బాలించెడి మౌర్యులను, ఉత్తరకర్ణాటములోని వనవాసిని బాలించెడి కదంబులను జయించి ఖ్యాతిగాంచెను. వీనికి "పులకేశి జయసింహుడు, విష్ణువర్ధనుడు" అను ముగ్గురు కుమారులుండిరి కాని కీర్తివర్మ మరణానంతరము వాని పుత్రులు మిక్కిలి పసివాండ్రుగనుండుటచేత కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు రాజ్యభారమును వహించి పరిపాలనము సేయుచుండెను.

మంగళేశుడు.

ఇతడు రాజ్యమునకు వచ్చిన తరువాత త్రిపురమును రాజధానిగా చేది దేశమును బాలించుచుండిన కాలచుర్యులను రాజులను జయించెను. ఇతడు తన దిగ్విజయయాత్రలను పూర్వపశ్చిమ సముద్రముల వఱకు బఱపెనని చెప్పుదురు. పశ్చిమసముద్ర తీరమునందలి రేవతీద్వీపమునితడు వశము జేసికొనియెను. ఇతడు విష్ణ్వాలయములను నిర్మించి భూములొసంగి బ్రాహ్మణుల కనేక దానధర్మములను గావించి పేరుపొంది యిరువది నాలుగు సంవత్సరములు పరిపాలనము చేసి యుండెను. వీని తరువాత రాజ్యమునకు వచ్చినవాడు కీర్తివర్మ జ్యేష్ఠకుమారుడయిన పులకేశి. మంగళేశుడు తన తరువాత తన కుమారుడే రాజ్యపాలనము చేయుటకై రహస్యముగాబ్రయత్నములు చేయుచుండుటను గనిపెట్టి యుక్తవయస్సు వచ్చి మిక్కిలి సామర్థ్యము గలిగియుండిన పులకేశి వాని ప్రయత్నములనన్నిటిని భగ్నముగావించి రాజ్యాధికారమునంతను దాను బూని పరిపాలించుచుండెను. మంగళేశుడు తన కుమారునికి పట్టము గట్టవలెనని చేయుచుండిన ప్రయత్నములో దన ప్రాణములను రాజ్యమునుగూడ గోల్పోయెను.

శ్రీ పృథ్వీ వల్లభ మహారాజు.

ఇతడు శాలివాహనశకము 533నకు సరియైన క్రీస్తుశకము 611వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చెనని యొక శాసనమునుబట్టి దెలియుచున్నది.