పుట:Andhrula Charitramu Part-1.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట! పిమ్మట నీవంశములో నొకశాఖవారు దక్షిణాపథమునకు వచ్చిరట! ఈ విక్రమాంక దేవచరిత్రము విక్రమాంక దేవుడను నామాంతరముగల పశ్చిమ చాళుక్యరాజయిన యాఱవ విక్రమాదిత్యుని చరిత్రమును దెలుపునదియై యున్నది. ఆంధ్రచాళుక్యులగు విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు, విక్రమచోడుడు మొదలుగువారు ప్రకటించిన శాసనములలో నీగాథయె కొంతమార్పు తో బ్రకటింపబడినది. విజయాదిత్యు డయోధ్యానగరమునుండి దక్షిణాపథము మీద దాడివెడలివచ్చి యీదేశమును బరిపాలించుచుండిన త్రిలోచన పల్లవునితో యుద్ధము చేసి రణవిహతుడైనట్లును, పతి వెంటవచ్చిన యాతనిపట్టమహిషి గర్భవతియై యుండి యా యాపత్సమయములో బురోహితుని గొందఱు పరిచారికలను వెంటగొని ముదినే మనియెడి యగ్రహారమునకు దప్పించుకొని పోగా విష్ణుభట్ట సోమయాజియను బ్రాహ్మణుడామె నాదరించి తన గృహమున నుంచుకొని తాను గన్నకూతురువలె జూచి యామె గర్భమునబుట్టిన మగ పిల్లవానికి క్షత్రియోచితములయిన జాతకర్మాది సంస్కారములు నడిపి విష్ణువర్థనుడని పేరుపెట్టి పెంచినట్టును, అతడు ప్రాయము వచ్చినవెనుక తన తల్లివలన సర్వవృత్తాంతమును దెలిసికొని చళుక్యపర్వతమునకు బోయి తపస్సుచేసి తన తండ్రి రాజ్యమును వహించి కదంబులను గాంగులను జయించి నర్మద మొదలుకొని సేతువువఱకు నున్న యేడుకోట్ల యేబదిలక్షల గ్రామములు గల దేశమంతయును బరిపాలించినట్టును పైశాసనములలో జెప్పబడియున్నది. నాటనుండియు చాళుక్యరాజులకు విష్ణువర్థనుడను పేరు పరంపరగా వచ్చుచుండెను. చాళుక్యుల తామ్ర శాసనములలో మొదట వీరు మానస్యగోత్రులనియును హారిత పుత్రులనియును దెలుపబడియుండెను. వారలు సప్తమాతృకల రక్షణముగలిగి కార్తికేయానుగ్రహమున నభ్యుదయమునుగాంచిరి. వారు నారాయణానుగ్రహముచే వరాహధ్వజమును బడసి యా ధ్వజము నీడనుండి అనేకరాజులను వశపఱచుకొనిరి. ఆఱవశతాబ్దమున మొట్టమొదట జయసింహుడను రాజు రాష్ట్రకూట రాజయిన కృష్ణుని కుమారుడగు నింద్రుని నుక్కడంచి రాజ్యమును స్థాపించి చాళుక్యవంశ కర్తయయ్యెనని యేవూరు మిరా