ఆంధ్ర చాళుక్యులు.
ఏడవశతాబ్దారంభమున జాళుక్యు లాంధ్రదేశముపై దండెత్తివచ్చి పల్లవరాజులను జయించి దేశమును స్వాధీనముపఱచుకొని నాటనుండి వేంగీదేశమును బరిపాలింప గడంగిరని పూర్వప్రకరణమున దెలిపియుంటిమి. "ఈచాళుక్యులెవ్వరు? ఎచ్చటినుండి వచ్చినవారు? వీరియుదంతమేమి?" అని చదువరులుప్రశ్నింపవచ్చును. కాబట్టి యాంధ్రచాళుక్యుల చరిత్రముందెలిసికొనుటకు బూర్వము వారి పూర్వుల రాజ్యక్రమము సంక్షిప్తముగా నిందు దెలుపుట యనావశ్యకముగాదు. చాళుక్యుల జన్మాదిక కథనమంతయు గల్పిత గాథలతో నిమిడియున్నది. అయిన నవియె మనకు శరణ్యములుగానున్నవి. ఈ కల్పితగాథలు గ్రంథములలోనికిని శాసనములలోనికిని గూడ నెగ బ్రాకినవి. బిల్హణ కవి విరచితమైన విక్రమాంక దేవచరిత్రమునందు చాళుక్యుల జన్మకథనము కొంత వివరింపబడినది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ప్రాత కాల కృత్యంబుల నిర్వర్తించుచుండ నచ్చటికి నింద్రుడు చనుదెంచి ప్రపంచముననే మనుష్యుడును యజ్ఞయాగాది క్రతువులనాచరించి దేవతలకు హవిర్భాగంబుల నొసంగకుండుట జేసి పాపము వర్థిల్లుచున్నదని మొఱవెట్టుకొని యెనట! అంతట బ్రహ్మదేవుడర్ఘ్యమిడు నిమిత్తముదకమునకై పట్టియుండిన తన చులుకము (పుడిసిలి) కేసి చూచెనట! అంతటా చులుకమునుండి మహాయోధుడొకండు జనించి చాళుక్యవంశమునకు గర్తయయ్యెనట! తరవాత మఱికొంతకాలమునకు నా వంశమునందు హరితుడు మానవ్యుడునను నిరువురు మహావీరులు జనించి జగద్విఖ్యాత కీర్తిగాంచిరి. వీరి మొదటి రాజధాని అయోధ్యానగరముగా నుండె