Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణుడుగాడు. 4 సృష్టియు సృష్టిలోని జీవులనాదులుగానవినాశనమును చెందునవి కావు 5 ఈ భూమికి దిగువన నేడునరకలోకములును, పైన బదునారు దేవలోకములును, గలవు;అన్నిటికిని బైన బదునేడవది ఆగమీంద్రలోకముగలదు.;అచ్చటనే సర్వేశ్వరుడు నివసించుచుండును; పుణ్యాత్ములగువారచ్చటికి బోయెదరు. పాపాత్ములు నరకలోకమునకు బోయెదరు. ఇదివరకు వెడలిపోయిన తీర్ధంకరులను గురువులను పూజింపవలయును; 7అహింసా ధర్మమును నాచరణములోనికి దీసికొని రావలెను. అహింసయే వీరివ్రతములలో ప్రధానమైనవ్రతముగానున్నది. జీవహింస కలుగునను భయముచేత వీరలు రాత్రి భోజనమునుమాని సాయంకాలముననే భుజింతురు. వడియగట్టని నీరును ద్రాగరు. మొదట వీరికి జాతిభేదము లేక పోయినను ఇప్పటి వారు జాతి భేధమును బాటించుచున్నారు.

ఆంధ్రదేశమున జైనమతవ్యాపనము.

ఆంధ్రదేశమున నొకప్పుడు జైనమతము వ్యాపించియున్నదని చెప్పుటకు దృష్టాంతము లిప్పటికీ ననేకములు గలవు. ఆంధ్రదేశమున నెచ్చటజూచినను జైనవిగ్రహములే గానంబడుచున్నవి. గోదావరి మండలములోని కాకినాడ తాలూకాలోనున్న ఆర్యనట్టమనుగ్రామము జైనవిగ్రహములనుగలిగి యుండి కొన్ని సమయములందు జైనపాడని పిలువబడుచున్నది. ఆవిగ్రహములే గొన్నిసన్యాసదేవులను పేరుతో పిఠాపురము వీధులలో హిందువులచే బూజింపబడుచున్నవి. అనావృష్టి కాలమున నీవిగ్రహములకు ఉత్సవము చేయంబడును. అమలాపురము తాలూకా నేదునూరు గ్రామములో ని విగ్రహములు మండలములోని యన్నింటికంటెను బెద్దవిగానున్నట్లు చెప్పబడుచున్నవి. ఇట్టి జైన విగ్రహములు కొన్ని రామచంద్రాపురము తాలూకాలోని కాజలూరు, ఎండమూరు, సీల మొదలగు గ్రామములలోనూ, పిఠాపురము తాలూకాలోని జల్లూరులోనూ, అమలాపురము తాలూకాలోని ఆత్రేయపురములోను, నగరము తాలూకాలోని దాక్షారామములోను గానుపించుచున్నవి. అమలాపురము నగరము తాలూకాలలోని పురాతనము లయినబావులు కొన్ని జైనబావులని పిలువంబడుచున్నవి.