Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమేశ్వరవర్మ.

ఇతడు రెండవమహేంద్రవర్మ కొడుకు పరమేశ్వరవర్మ యనుపేరు వహించిన వారిలో నితడు మొదటివాడు. ఈపరమేశ్వరవర్మ రాజ్యభారమును వహించి పరిపాలనము సేయుచుండిన కాలమున పశ్చిమచాళుక్యరాజును రెండవపులకేశివల్లభుని కుమారుడును నగు మొదటి విక్రమాదిత్యుడు 655 వ సంవత్సరమున నదివఱకు బల్లవులచే నాక్రమింపబడిన తనదేశమును స్వాధీనపఱచుకొనుటకై కాంచీపురముపై దండెత్తివచ్చి పరమేశ్వరవర్మను నోడించి కాంచీపురమును గైకొనియెనని విక్రమాదిత్యుని శాసనము వలన దెలియుచున్నది. అయినను తరువాత పరమేశ్వరవర్మ పెరువల నల్లూరను ప్రదేశమున విక్రమాదిత్యునితో ఘోరసంగ్రామమును సలిపి చాళుక్యుల నోడించినట్లుగ కురముగ్రామములోని పరమేశ్వరవర్మశాసనము దెలుపుచున్నది. ఎట్లయినను అదివఱకు పల్లవుల స్వాధీనములో నుండిన కందవోలు మండలమంతయు గాని కొంతవఱకు గాని చూళుక్యుల స్వాధీనమై యుండెననుట వాస్తవము. చాళుక్య విక్రమాదిత్యుని తామ్రశాసనములు రెండును, విక్రమాదిత్యుని కొడుకు వినయాదిత్యుని శాసనములు రెండును మొత్తము నాలుగు శాసనములు చాళుక్యులని యా మండలమున గానంబడుచున్నవి.

రాజసింహుడు లేక రెండవనరసింహవర్మ.

ఇతడు పరమేశ్వరవర్మ కొడుకు కాంచీపుర కైలాసనాథుని దేవాలయములో నడుమనుండిన రాజమహేశ్వరుని గుడిని కట్టించినవాడితడే.

మూడవమహేంద్రవర్మ.

రాజసింహునియనంతరము సింహాసనమధిష్ఠించిన వానికుమారుడుమూడవమహేంద్రవర్మ తండ్రికాలమున పూర్తికాని దేవాలయపుంబనులను పూర్తికావించినవాడు. ఈయిరువురి రాజులను గూర్చి చెప్పదగిన విశేషాంశములేవియును లేవుయ.