చినట్లు చెప్పబడి యుండెను. ఈ వంశములో నాల్గవ పురుషుడుగా జెప్పబడిన యుగ్రవర్మయే యుగ్రసేనుడయిన యెడల నైదవశతాబ్దములోను కాకయుండిన నాఱవశతాబ్దములోను వీరలుండియుందురు.
చాళుక్యులదండయాత్ర.
వాతాపినగరము రాజధానిగా జేసికొని యుత్తరకర్ణాటమును దక్షిణ మహారాష్ట్రమును బరిపాలించుచుండిన చాళుక్యుల రెండవపులకేశివల్లభుని కాలమున నానాముఖముల విజృంభించి చుట్టుపట్లగల దేశముల నాక్రమించుకొనుచు నాఱవశతాబ్దాంతమున నాంధ్రదేశముపై దండెత్తివచ్చిరి. ఆంధ్రదేశమంతయు బలురాష్ట్రములుగానుండి వెఱ్వేఱు స్వతంత్ర రాజ్యములుగ నేర్పడి పెక్కండ్రు పల్లవరాజులచే బరిపాలింప బడుచు బరస్పరసహాయములేక గాబోలు బలహీనుములయి సులభముగా జాళుక్యులకు వశము లయ్యెను. చాళుక్యులకు లోబడని పల్లవరాజులు కాంచీపురమునకు దఱుమబడిరి. ఏడవశతాబ్దిని చాళుక్యులాంధ్రదేశముయొక్క పశ్చిమోత్తర భాగములును ఈశాన్యప్రాగ్భాగముల నాక్రమించుకొనిరి. ఆంధ్రదేశముయొక్క దక్షిణ పశ్చిమభాగములను ఆంధ్రచోడులును మహాబాణులు నాక్రమించుకొనగా నింక బల్లవులకు గాంచీపుర ప్రాంతభూమిమాత్రము మిగిలెను. ఉత్తరమున దేశమును గోల్పోయినతోడనే పల్లవులు దక్షిణమున జోళరాజ్య మాక్రమించుకొని పాండ్యచోళకేరళాదులతోడను పశ్చిమంబున గదంబులతోడను గాంగులతోడను ఉత్తరంబున రాష్ట్రకూటులతోడను చాళుక్యులతోడను విధివిరామములేకుండ నహోరాత్రము లొకశతాబ్దము పోరాడిన విషయము చరిత్రమునందునుపమానమయినదిగ నున్నది. ఏడవశతాబ్దమునుండి కాంచీపురములోని పల్లవులకు నాంధ్రదేశముమీద నధికారముతొలగిపోయి ద్రావిడదేశమునందే నిలిచిపోవుట చేత వారిచరిత్రమంతగా మనకవసరము లేకపోయినను చరిత్రములోని సంబంధము తెగిపోకుండ నిలువుటకై యొకింత సంగ్రహముగా నిటదెలుపుచున్నారము.