పుట:Andhrula Charitramu Part-1.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిక్కిలి ప్రాచీనమైనదిగ భావింపబడుచున్నది. [1] ఇందు విజయస్కందవర్మ కుమారుడగు విజయబుద్ధవర్మ యొక్క రాణియగు చారుదేవి దాలుర గ్రామములోని కులిమహాతారక దేవాలయములోని దేవుడగు నారాయణునకు, మంచినీళ్లబావికీ నుత్తరపు దిక్కునను రాజు చెఱువునకు దిగువను నాలుగు నివర్తనములభూమిని, దానము చేసెనని కటకములోని వ్యాపృతునకు దెలియజేయబడి నటుల నీ శాసనమునందు జెప్పబడినది. ఈ చారుదేవి బుద్ధయాంకురవర్మ యొక్క తల్లియనిగూడ పేర్కొనబడినది గాని వీరెచ్చటివారో పేర్కొనబడియుండలేదు. కటకమనగా ధాన్యకటకమేమోయని సందియము కలుగుచున్నది. దాబారయనునది కృష్ణామండలములోని యిప్పటి దావులూరు గ్రామమునకు వర్తించునేమో యింకను విచారింపవలసి యున్నది. ఈ విజయస్కందవర్మ రెండవశతాబ్దాంతమునగాని మూడవశతాబ్దాదిని గాని యుండి యుండవలయునని యూహింపవచ్చును. ఇతడు భారద్వాజ గోత్రుడగుటచేత సాలంకాయనులగు వేంగీరాజులకు సంబంధించిన వాడుగాడు. ఆంధ్రభృత్యవంశములో నుదాహారింపబడిన విజయశ్రీయనువాడేమో భావిపరిశోధనములవలనంగాని దెలియంబడదు.

విజయనందివర్మ.

ఇతడు వేంగిపురము రాజధానిగా వేంగిరాష్ట్రమును బాలించినవారిలో నొకడు. వీనిశాసనము సంస్కృతభాషలోనుండుటచేత నితడు విజయదేవవర్మకును, హస్తివర్మకును దరువాతి వాడని యూహింపబడుచున్నాడు. ఇతడు సాలంకాయనుడు. విజయదేవవర్మవలెనె చిత్రరథస్వామి పాదసేవాతత్పరుడు. వీనిశాసనము కొల్లేరునకు సమీపమున దొరకినది. [2] ఇతడు తనశాసనమునందు బప్పా భట్టారక పాదభక్తుడనని చెప్పుకొనియెను. ఇట్లు చెప్పుకొన్న

  1. Ep. Ind. Vol Viii. pp.145-116. ఇది గుంటూరు మండలములోని కొండకూరులో మాధవరావువలన కనగొనబడినది.
  2. Indian Antiquary. Vol V.p. 175