చుధనంజయుని, అటుతరువాత కాంచీపురాధీశ్వరుండయిన విష్ణుగోపుని జయించి దైవపుత్రుల (ద్రమిళులు) పైకిబోయెను. ఇందుచెప్పబడిన దేశములును రాజులును పట్టణములు నిప్పటి యాంధ్రదేశములోనివేగాని యన్యములుగావు. కొత్తూరు గంజాము మండలములోని మహేంద్రగిరికి 12 మైళ్లదూరముననున్నది. ఈరందపళ్లయు, దేవరాష్ట్రమును, అనముక్తయు గంజాము విశాఖపట్టణమండలములలోనివిగాని యన్యములుగావు. చీపురుపల్లి ప్రాంతదేశము దేవారాష్ట్రమని చాళుక్యలశాసనములందును, గాంగపల్లవులశాసనములందును బేర్కొనబడినది. పిష్టపురము ప్రాచీనకళింగమునకు రాజధానిగ నుండెను. ఇది యిప్పటి గోదావరిమండలములోని పిఠాపురమెగాని యన్యముగాదు. వేంగి వేంగీపురమేగాని యన్యము కాదు. కుష్ఠలపురము పాలక్కడ నెల్లూరు మండలములోనివిగా గన్పట్టుచున్నవి. కాంచీపురము ప్రసిద్ధమైనది. వీరలచరిత్రము మనకేమియు దెలియరాకున్న యది. వీరిపేరులు సముద్రగుప్తునిశాసనముల దుదాహరింపబడుటచేత దెలిసినవిగాని లేకపోయిన వీని నైనందెలిసికొనుట కాధారమేలేకపోయియుండును. సముద్రగుప్తుని శాసనమునందు దైవపుత్రులని చెప్పబడినవారు జాతులవారయి యుందురు. కాంచీపురమును బాలించువిష్ణుగోపవర్మయు, వేంగిని బాలించుహస్తివర్మయు పిష్ఠపురమును బాలించుమహేంద్రవర్మయు పల్లవులయియుందురు. మహేంద్రవర్మయు, హస్తివర్మయు విష్ణుగోపవర్మకు లోబడి పాలనముచేయ సామంతరాజులని కొందఱుతలంచుచుండిరి కాని యెచ్చటను జెప్పబడియుండలేదు ప్రస్తుతనిరాధారస్థితియందు వారుమువ్వురు వేఱ్వేఱు స్వతంత్రరాజులనియె మనమూహింపవలయును.
విజయస్కందవర్మ, విజయబుద్ధవర్మ.
విజయస్కందవర్మ పరిపాలనము సేయుచుండిన కాలమున వానికుమారుడును యువమహారాజునగు విజయబుద్ధవర్మయొక్క భార్యయు రాణియునకు చారుదేవియొక్క దానశాసనమొకటి గాన్పించినది. ఇదియును బ్రాచీన ప్రాకృతభాషలోనే యుండ మోటుగానుండు నక్షరములతో గూడియుండుటచేత