పుట:Andhrula Charitramu Part-1.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాబట్టి అఱవలను పేరు నాగులలో నొకతెగవారిదిగాని ద్రావిడులదిగాదు. అఱవనాడునుండి మొదట ద్రావిడులీదేశమునుకు వచ్చుటచేత వారిని మనవారఱవలని పిలువనారంభించిరికాని నిజముగా వారలఱవులుగారు. శివస్కందవర్మ కాంచీపురమునుండి తనశాసనములను బ్రకటించిన కాలమున నాదేశము వాసుకిసంతతివారలయిన యఱవనాగులచే నివసింపబడు వఱవనాడుగానుండెనుగాని మఱియొకపేరుతో లేదు. కాబట్టి మొట్టమొదటి వేంగిదేశము కృష్ణాగోదావరినదీ ముఖద్వారములకు నడుమనుండు దేశమనగా నిప్పటికృష్ణామండలమునకు వర్తింపగలదు. దీనియుత్పత్తికి గారణమీవిధముగా జెప్పుకొనవచ్చును. మొట్టమొదటనీదేశమునకు గూడూహరవిషయమను పేరుగలదు. అప్పుడు కూడూరా(గుడివాడ లేక గూడూరు) అనుపట్టణము రాజధానిగనుండెను. ఏకారణముచేతనో రాజధాని మార్చుకొనవలసివచ్చినది. సాలంకాయనగోత్రులయిన పల్లవరాజులలోనొకరు నూతనముగా ననుకూలమగు నగరమొకదాని నిర్మించివేగియనగా పులియని యర్థముండుటచేతను, శత్రువులకు బెబ్బులివలె సమీపించసాధ్యముకానిదని సూచించుచుండుటచేతను వేంగీపురమని పేరు పెట్టియుండును. వేంగీపురమును బాలించినరాజులను వేంగీరాజులనుట సామాన్యమగా వ్యవహారమునకు వచ్చియుండును. వేంగిరాజులు జయించిన దేశమునకు గాని పాలించినదేశమునకుగాని వేంగిరాష్ట్రమనికాని వేంగీదేశమనికాని పేరుపెట్టబడినదన్న వింతయేమున్నది? కాబట్టి మొట్టమొదట వేంగీపురమేర్పడి దానింబట్టి వేంగిదేశమువాడుకలోనికి వచ్చినది. వేంగియనునఱవశబ్దము తెలుగులో వేగియని పిలువంబడుచున్నది. ఈ వేంగి దేశము పల్లవులకాలమునను చాళుక్యులకాలమునను దక్షిణమున గాంచీపురమువఱకును నుత్తరమున మహానదివఱకును వ్యాపించినది. నన్నయభట్టుకాలమున రాజమహేంద్రవరము మొదలుకొని కాంచీపురముకునుగలదేశము వేగి దేశముగానే పరిగణింపబడుచువచ్చెను. వేగిదేశమునకి దగ్థరాష్ట్రమని పేరుచెప్పుట కేవలము పొరబాటని చెప్పవలయును. అట్లయిన యెడల వేంగిపురమును దగ్ధపురమని చెప్పవలసివచ్చి యపహాస్యము పాలగుట తటస్థింపవలసివచ్చును. వేంగిరాజులయిన మొదటిపల్లవులకాలమున నఱవనాడు