డిన యీ వేంగీపురము నే యాంధ్రనగరియని పిలిచియున్నాడు.[1] విజయదేవవర్మ విజయనందివర్మ శాసనములలో నుదాహరింపబడిన చిత్రరథస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యా పేరుతోనే పిలువంబడుచున్నది.[2]
అఱవనాడు-వేంగిదేశము.
ఆంధ్రదేశమునకు వేంగిదేశమను పేరెట్లుకలగినదియు గొంతవఱకు మూడవప్రకరణాంతమున దెలుపబడినది గాని యదిచదువరులకంతగా దృప్తి కలిగింపజాలదు. ఎందుకన మొదటివేంగి దేశమని యేభాగము పిలువంబడియెనో దెలిసికొనుట కష్టసాధ్యముగ నుండెను. మొదటి వేంగిదేశము కన్నడదేశప్రాంతమని చెప్పెడివారిమాట యెంతమాత్రమును విశ్వసింపదగినదికాదు. కాంచీపురప్రాంతదేశమునకు మొదటివేగివాడనుపేరు కలదని యూహింపబడినది కాని వాస్తవిమిదికాదు. ఇకమొదటి వేగిదేశమేభాగమునకువర్తించునో సహేతుకముగా నిర్ధారణముచేసిన గాని చదువరులకు దృప్తికలిగింపజాలదు. ఈ దేశము పూర్వము నాగులచే బరిపాలింపబడుచుండెనని యైదవ ప్రకరణమున విశేషముగా జర్చింపబడినది. దక్షిణదేశమునందలి నాగులలో మరవార్ అయినార్,ఒలియార్, ఒవియార్, అఱవలార్, పరదవార్ , మొదలగు పేరులుగల తెగలవారు నివసించుచుండిరి. వారిలో "అఱవలార్" అనగా అఱవలు కాంచీపురప్రాంతదేశమున నివసించుచుండిరి. ఆ కారణముచే నాభాగమునకు "అఱవనాడు" "అఱవనదలై" అనునామములుగలిగెను. కాంచీపురమునకు దక్షిణదేశ మఱవనాడుగను, గాంచీపురముండిన ప్రదేశమఱవవడదలై యనియు బిలువంబడుచుండెను. టాలెమీ మొదలగు విదేశియచరిత్రకారులు మసాలియా దేశమునుకు దిగువభాగమును అశార్ నోరి (అర్ వార్ నాయ్) అనగా అఱవవాడని పేర్కొనియుండుటగూడ నీ యంశము ధ్రువపడుచున్నది.