విజయదేవవర్మ పూర్వుడని చెప్పవలసియున్నది. ఇతడు సాలంకాయన గోత్రుడు. విజయనందివర్మవలెనె చిత్రరథస్వామిపాదసేవా తత్పరుడు చిత్రరథస్వామిదేవాలయము వేంగీపురమునందున్నది.
వేంగీపురము లేక వ్యాఘ్రపురము.
వేంగీదేశమునకు ముఖ్యపట్టణముగానుండిన వేంగీపురము కృష్ణామండలములోని యేలూరునకు నుత్తరమున 8 మైళ్లదూరమున నుండెడిది. ఆస్థానమునందిపుడు పెదవేగి, చినవేగి అనుపల్లెలు మాత్రము గలవు. వీనికి దక్షిణముగా 5 మైళ్లదూరమున దెందులూరను గ్రామముగలదు. ఈ గ్రామమునకు గంగనగూడము సేనగూడెము మొదలుగు సివారుపాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిపి యొక మహాపట్టణముగానుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలములయిపోయిన శివాలయములు పెక్కులు గలవు. మఱియును విజ్ఞానేశ్వరునియొక్క విగ్రహములు నాలుగు దెందులూరునకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండియున్నవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామమునకు దూర్పుప్రక్కను భీమలింగము దిబ్బయనుపేరుగల యెత్తైన యొకపాటిమట్టిదిబ్బగలదు. దానికుత్తరముగా మాకమ్మ చెఱువును దానినడుమనొక మట్టిదిబ్బయు, దానిపైన రెండుఱాతినందులను గలవు. ఈ గ్రామమునకు బడమరగానొకచెఱువు గలదు. దానిని నారికేళనారిచెఱువని చెప్పుదురు. వానిగట్లపైనిరెండుశిలాశాసనములు నిలువుగానుండియ, మఱిరెండు సాగిలంబడియు నుండినవి, పెదవేగికిని చినవేగికిని నడుమ మఱియొక మంటిదిబ్బగలదు. వీనినన్నిటిని బరిశోధించిచూడగా వేంగీపురము మిక్కిలి యున్నత స్థితియందుండిన పూర్వకాలమున నొక యందమైన మహానగరముగానుండెననుటకు సందియములేదు. ఇచ్చటి దేవాలయములయొక్క ఱాళ్లను తురకలు గొనిపోయి యేలూరులోని కోటనుగట్టిరని తెలియుచున్నది. వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడనుండెనాయని కొందఱు సంశయించుచుండిరిగాని విజయదేవవర్మయొక్కయు, విజయనందివర్మయొక్కయు శాసనములాసంశయమును నివారించినవి. మఱియును దండియను మహాకవి కొల్లేరును వర్ణింపుచుదానికి ననతిదూరముగాను