Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయవర్మ.

శివస్కందవర్మ గాక మఱికొందఱు ప్రాచీనపల్లవరాజులపేరులు శాసనములందు గానవచ్చుచున్నవిగాని వారి కాలము మాత్రముసరిగా దెలియరాదు. మఱియొక విశేషముకలదు. ఈ ప్రాచీన పల్లవుల శాసనములన్నియును ఆంధ్రదేశమునందే గానవచ్చుచున్నవి. కూడూహార విషయాధిపతియగు జయవర్మయొక్క తామ్రశాసనమొకటి తెనాలి తాలూకాలోని కొండమదిగ్రామమునందలి మంటిదిబ్బలో దొరకినది.[1] ఈ శాసనములోని లిపి శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనములోని లిపిని బోలియున్నది. మహేశ్వర బృహత్పలాయన శబ్దములు రెండును దక్కతక్కినదంతయు బ్రాకృతభాషలోనున్నది. ఈశాసనములోని రాజముద్రికలో జయవర్మమహారాజుపేరు గానంబడుచున్నది. ఇతడు బృహత్పలాయన గోత్రుడు. మహేశ్వర పాదభక్తుండు. ఇతడు కూడూహారమండలములోని పంతూరనుగ్రామమును 7 గురు బ్రాహ్మణులకు దానముచేసి యున్నానని కూడూరులోని తన వ్యాసృతులకు దెలియంజేసియున్నాడు. కూడూరు రాజధానీనగరముగా నుండెను. ఈ జయవర్మగాని వీనిగోత్రముకాని మఱియేశాసనమునందును గానరావు. ఇతడు శివస్కందవర్మ కాలమునాటి వాడని చెప్పవచ్చునుగాని యాతనికి సామంతుడో లేక స్వతంత్రుడో దెలియరాదు. ఈ శాసనములోని భాషయు లిపియు గోతమిపుత్రశాతకర్ణియొక్కయు, వాసిష్ఠీపుత్ర పులమాయి యొక్కయు నాసిక శాసనములను బోలియుండుటచేత నారాజులకు మిక్కిలి దూరమున నున్నవాడని చెప్పరాదు. రాజముద్రికలోని ప్రాచీన సంస్కృతలిపికూడ దీనినే బలపఱచుచున్నది. ఇది వేంగిదేశమున కనగా నిప్పటి కృష్ణామండలమునకు బ్రాచీననామము. దీనికి రాజధానికూడూరు. ఈ కూడూరు గుడివాడయొక్కయో గూడుర యొక్కయో ప్రాచీననామము. ఈ శాసనము మహాత్యాగివంశములో యోగ్యుడును జయవర్మమహారాజుయొక్క మహాదండనాయకుడును నగు.

  1. Epigraphla India Vol vii, p. 315.