పుట:Andhrula Charitramu Part-1.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాసిష్టీపుత్రశాతకర్ణినో రెండుసారులు జయించెనని కూడా జెప్పబడియుండెను. ఈ క్షాత్రపులకు నాంధ్రులకు సంబంధ బాంధవ్యములు గలవని శాసనములు చాటుచున్నవి. రుద్రదాసుడు తన కుమార్తెను నాంధ్రరాజునకిచ్చి వివాహం చేసినట్లుగా శాసనముల బేర్కొనంబడియెను. కాబట్టి వీనినన్నింటిని పరిశీలించి చూచినప్పుడు పహ్లవులు దేశాచారమతాచారముల నవలంబించి దేశీయనామములనే ధరించి పల్లవులై యాంధ్రులకు క్షాత్రపులకు నూడిగములు సలుపుచుండి క్రమముగా సేనాధ్యక్షులుగాను మంత్రులుగా నేర్పడి రాజకుటుంబముతో సంబధబాంధవ్యములు నెరపుచు ప్రధాన రాజకుటుంబము బలహీనమై రాజ్య భారమును నిర్వహించజాలని కాలమున స్వతంత్రులై స్వతంత్రరాజ్యములు నెలకొల్పిరని యూహింపదగియున్నది. స్వదేశమును స్వమతమును మరచి పోయి హిందూమతములను బూని హిందూనామములను బెట్టుకొని వ్యవహరించుచు బహుకాలమునకు వెనుక నాంధ్రదేశమునకు వచ్చి వర్ణాశ్రమధర్మములంతగాబాటింపబడని కాలమున నొకశతాబ్దమువరకు నాంధ్రులనబడుచు నివసించుచుండి సంబంధబాంధవ్యముల నెరపుచుండిన వారాంధ్రులుగా గాక మరిఎవ్వరుగా బరిగణింపబడ వలసినది?

ఆంధ్రులనక తప్పదు. ద్రావిడదేశమునందలి కాంచీపురమును జయించి పరిపాలించినది యాంధ్ర పల్లవులుగాని పహ్లవులుగారు.కాంచీపురమునందు కట్టకడపట స్థిరముగా నిలిచిపోయినది యాంధ్రపల్లవులలో ఒక శాఖ వారుమాత్రమే గాని కొందరు తలంచునట్లు పల్లవులందరుగారు. ఇప్పటివరకు దొరికిన శాసనములను బట్టిచూడగా మొదటి పల్లవరాజు శివస్కందవర్మగా గానంబడుచున్నాడు ఇతడే మొదట కాంచీపురమునుండి శాసనములం బ్రకటించినవాడు "ఇతడాంధ్రుడా ? పల్లవుడా ? ఏకాలపు వాడు?" అనువిషయములను చర్చించి తెలుసుకొనవలసి యున్నది.

- - -<>- - -