న్నది. ద్రవిడరాజ్యములతో బల్లవులకు గల విడువని శత్రుత్వమును,పల్లవులకిదియని నిర్దేశింపదగిన దేశములేకుండుటయును, పల్లవులు తమిళులకంటె భిన్నమైన జాతివారనుటకు సంజ్ఞలుగానున్నవి. దక్షిణభాగమునంతయు నాక్రమించిన పాండ్యచోళ చేరరాజుల పైని వారియధికారమధికముగా గూడ విధింపబడుచువచ్చెను. పల్లవులు పదునెనిమిదవ శతాబ్దములోని మహారాష్ట్రులవలె గొల్లపెట్టెడుదోపిడి కాండ్రతెగగానుండి క్రమముగా స్వబలముచేత చోళరాజ్యము పై సంపూర్ణముగను, తక్కిన వానిపై గొంతవఱకును నధికారమును బూనియుండిరని మనమూహింతుమేని నింతవఱకు దెలియం బడిన విషయములా యూహకు సరిపోవునని తలంచెదను."
పల్లవులు దారిదోపిడికాండ్రతెగవారని యూహించుటకు హేతువు గానరాదు.వీరలు కృష్ణా గోదావరులకు నడుమ వేంగిదేశమునగాని మఱియేభాగమునగాని యాంధ్రదేశమునం దేర్పడిన యొక తెగవారనుట వాస్తవము. రెండవశతాబ్దమునుండి పల్లవరాజు లాంధ్రదేశమును బాలించుచుండిరని వారిశాసనములే వేనోళ్ల ఘోషించుచున్నవి. ఈ విషయమును జరిత్రకారులందఱు నంగీకరించి యున్నారు. ఈ తెగ యెట్లేర్పడనదను విషయములో మాత్రము చరిత్రకారులు భిన్నాభిప్రాయాలయి యున్నారు. పల్లవులు దారిదోపిడికాండ్ర తెగయనుటకంటెను పహ్లవులు పల్లవులయిరని యూహించుటకే హేతువు లెక్కువగ గానవచ్చుచున్నవి. పహ్లవుల ప్రదేశములు కందహారము, పెయిస్తాన్నులలో నేర్పడి గాండఫరేసు పరిపాలనములో అనగా క్రీస్తుశకము 20 దవసంవత్సరమునకును 60 దవ సంవత్సరమునకును నడుమ పంజాబుయొక్క పశ్చిమభాగమునకును సింధునది ప్రవహించు పల్లపు భూములకును వ్యాపించెను.
[1] సింధూనది ప్రవహించు పల్లపుప్రదేశములు పార్థియనుల స్వాధీనములో నున్నవనియు, తమలో దాము పార్థియునులు పోరాడుకొనుచుండిరనియి క్రీస్తుశకము 80 దవసంవత్సరమున రచింపబడిన పెరిప్లస్సను గ్రంథమునుబట్టి తెలిసికొనుచున్నాము.[2]