Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గానరావు. ఈ పల్లవరాజ వంశమైనను పలుశాసనముల యందు బలురీతులుగా నభివర్ణింపబడినది. ఈ పల్లవుడు క్షత్రియుడుగా జెప్పబడక బ్రహ్మకులము లోని వాడుగా జెప్పబడియెను. ఈ బ్రహ్మవంశము సహితము తాతలను మనుమలుగను, మనుమలను తాతలుగను జేయబడి బలు శాసనములలో వర్ణింపబడినది.

కాంచీపురము కైలాసనాధుని దేవాలయంలో నొకశాసనమున బ్రహ్మకునంగీరసుడు, వానికి బృహస్పతి, వానికి సంయువు, భరద్వాజుడు, వానికి ద్రోణుడు, వానికి అశ్వత్థామ, వానికి పల్లవుడు జనించెనని చెప్పియుండగా కుమారశాసనమున సంయువును నెగురగొట్టి బృహస్పతికి మనుమడుగ జెప్పబడిన భారధ్వాజుని, పుత్రునిగజేసి వర్ణించియుండెను. అమరావతీ శాసనమన్ననో బృహస్పతిని నెగురగొట్టి కురముశాసనమున నంగీరసునకు మనుమడుగా జెప్పబడిన భరధ్వాజుని నంగీరసునకు తండ్రిగాజేసి మధ్యసుధామానుడనువాని గల్పించి ద్రోణునకు దండ్రిగజేసెను. ఇంకనునిట్టివే వైచిత్య్రము లీశాసనము లోని వంశముల గన్పట్టుచున్నవి. పల్లవరాజులు కొందరు భారధ్వాజగోత్రికులమని చెప్పుకొనియున్నను మరి కొందరు సాలంకాయనులమనియు బృహత్పలాయనులమనియు జెప్పుకొనిరి. దక్షిణాపథమున రాజ్యాధికారముబూని పరిపాలనచేసినవారిలో పాండ్యచోళకేరళులు, చాళుక్యులు, గాంగులు, కాకతీయులు, మొదలగువారు తాము సూర్యవంశరాజులమని చంద్రవంశరాజులమని ఇక్ష్వాకువంశరాజులమని చెప్పుకొని యుండిరిగాని పల్లవుల వలె బ్రహ్మవంశజులమని చెప్పుకొనియుండలేదు. చోళులు సూర్యవంశజులమని చెప్పుకొని యుండిరి, పాండ్యులు చంద్రవంశజులమని చెప్పుకొని యుండిరి. కేరళులు తాము సూర్యవంశజులమని చెప్పుకొనిరి. చాళుఖ్యులు చంద్రవంశజులమనిరి. రాష్ట్రకూటులు అట్లే చెప్పిరి. మరియువీరలు పురాణకాలమున ప్రసిద్ధిగాంచిన పౌరాణిక రాజుల నుండి తాము జన్మించితిమని కూడ చెప్పుకొని[1]

  1. Ep.Ind. Vol. 5 text 2; line Vol. VIII p.145, text:line 2 and Vol VI.p.86 text line 2.