పుట:Andhrula Charitramu Part-1.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రమహాజనులకు విజ్ఞప్తి

సోదరులారా!

ఈ గ్రంథరచనయందుఁ బడినశ్రమయంతయు మీకుఁ దెలుపుట యనావశ్యకము. ఇదియే యాంధ్రదేశ చరిత్రమును దెలిపెడి ప్రథమగ్రంథమని భావించెదము. ఇదివరకు దేశచరిత్రమును గూర్చిన గ్రంథములేక యిదియె ప్రథమగ్రంథ మగుట చేత నంత నిర్దుష్టమైయుండఁజాలదు. గీర్వాణాంగ్లేయ భాషలయందు మహాపండితులై బహుసంవత్సరములు పరిశోధనముచేసిన డాక్టరు భాండార్ కర్ మొదలగు పండితులు వ్రాసిన ప్రాచీనచరిత్రములె నిర్దుష్టములుగా నుండ సాధ్యముకాకయున్నప్పుడు నావంటి యల్పజ్నుడు వ్రాసిన యాంధ్రదేశచరిత్రము యొక్క ప్రథమగ్రంథము నిర్దుష్టముగ నెట్లుండగలదు? అయిన నాకు దొరికిన సాథనములతో నొకరీతిగఁ జరిత్రమును వాసిపెట్టితిని.

ఎవ్వరైనను గ్రంథమును సాంతముగాఁ జదువకయె విమర్శనమునకుఁ బూనుకొనక గ్రంథము నామూలముగఁ బరిశోధించిన తరువాత వారికిం దోచెడు దోషములను సహేతుకముగా నాకుందెలిపినచో ద్వితీయముద్రణమునందు సవరించుకొనని యంతటి దురభిమానినిగా నని మీకుఁ దెలుపుచున్నాఁడను.

మఱియును గ్రంథరచన చేయుచున్న కాలముననే యీ చరిత్ర మచ్చుపడిన చిత్తుప్రతులను నేనే దిద్దుకొనవలసి వచ్చినందున భ్రమప్రమాద జనితములయిన యచ్చు తప్పులందందుఁ బెక్కులుపడినవి గావునఁ జదువరులు మన్నించివాని సవరించుకొని చదువుకొనవలయునని వేడుచు నింతటితో విరమించుచున్నాఁడను.

గ్రంథకర్త.