పుట:Andhrula Charitramu Part-1.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకొండవ ప్రకరణము.

ఆంధ్ర పల్లవులు.

- - -<>- - -

పల్లవుల చరిత్ర మగాధముగ నున్నది. పల్లవులు స్వదేశస్థులని కొందరును విదేశస్థులని మరికొందరు భిన్నాభిప్రాయాలై యున్నను మొదట నాంధ్రదేశమునుండియే దక్షిణమునకు బోయి యుండిరను విషయమును మాత్రము చరిత్ర కారులెల్లరు నంగీకరించిన వారు. విదేశస్థులని చెప్పెడి వారు దేశమతాచారముల నవలంబించిదేశములలో గలసి బహుశతాబ్దములు నివసించి యుండి తమతోంటి జన్మస్థానమును మరచి తాముండినదేశమే తమ దేశముగా భావించుకొనుచు దేశ పరిపాలనము చేసిన పల్లవులను విదేశస్థులనుగానే పేర్కొనుచుండుటయు, స్వదేశస్థులని చెప్పెడి వారు బహురాజ్యములను సంపాదించి రాజాధిరాజులై నిర్వక్రపరాక్రమమును జూపి దేశపరిపాలనము జేసిన వారిని దారిదోపిడి కాండ్ర తెగలలో చేర్చి పేర్కొనుటయు వింతగా గన్పట్టక మానదు. ఈ ద్విపక్షముల వారి వాదములను కేవలము సత్యములని యంగీకరింపరాదు; కేవలమసత్యమని నిరాకరింపనురాదు. కొంతవరకు సత్యములు నసత్యములుగూడానై యున్నవి. ఏదేశస్థులయినను, ఏజాతి వారయినను ఈ దేశమునకు వచ్చి ఈ దేశమతాచారముల నవలంబించి ఈ దేశనామముల నలంకరించుకొని ఈ దేశమే తమ మాతృదేశముగా భావించుకొనిన వారిని స్వదేశస్థులనుగానే పేర్కొనవలసి యుండునుగాని కడవరకు విదేశస్థులునుగానే భావించి అట్లు పేర్కొనచుండుట కేవలము బొరపాటని చెప్పదగును. గోదావరీనది నాసికాత్రయంబకముకడ జనించి సముద్రములో గలియువరకు నడుమ నెన్నో యుపనదు లెచ్చటెచ్చటనో పుట్టి వేర్వేరు నామములతో బ్రవహింపుచువచ్చి గోదావరీనది మహానదిలో గలియుచున్నవి కదా. అట్లు వరద, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి మొదలగు