Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును గాంచియుండినది. చెవులపోగులు పెద్దవిగా నుండినవి. ఒకొక్కప్పుడు దీర్ఘ చతుస్రములుగా నుండి భుజములపై వ్రేలాడుచున్నవి. చేతులకు మణికట్టులకడ బరువైన యందెలు కడియములు నుండినవి. పచ్చనిబొట్టు స్త్రీలమోము నలంకరించియుండెను. ముంగటి భాగము గుబురుగా నుండి ఎత్తైన ఒక తలపాగా పురుషులచే నలంకరించబడుచుండెను. స్త్రీలును పురుషులును కటిప్రదేశమునకు పైభాగమున నగలు తక్క విశేష వస్త్రాధికము ధరించి యుండలేదు. స్త్రీల నడుములకు నొడ్డాణములు గలవు. రణశూరులయిన యాంధ్రులు విల్లంబులును (ధనురస్త్రములు), కుంతములను(ఈటెలను), ఖడ్గములను ధరించుకొని యుండిరి. ఇత్తడి, రాగి, దంతము, మొదలగువానితో జేయబడిన నగలను బీదవారు ధరించి యుండగా భాగ్యవంతులు బంగారు నగలను ధరించి యుండిరి. ఆ కాలమున లోహములలో వెండి మిక్కిలి స్వల్పముగా నుండుట చేత వెండినగలనెవ్వరును ధరించి యుండ లేదు. భాగ్యవంతులు కాళ్ళకు గూడా బంగారు అందియలను బంగారు కడియములను ధరించి యుండిరి. ఈ కాలమునందు గొన్ని తెగలలో వలె దమ స్త్రీలకు ముసుగులు వేసి సూర్యరశ్మినైన గానరాకుండ మూల గూర్చుండబెట్టు విపరీతాచారములు వారెరుంగరు. ఆంధ్రరాణులు సహితము రాజసభలలో దమ భర్తల పక్కన కూరుచుండుచు వచ్చిరి. ఉన్నత స్థితియందుండుండిన స్త్రీలు సహితము విధ్యాభ్యాసమును జేయుచుండిరి. ఆకాలమునందు పురుషులు స్త్రీలను మిక్కిలి మర్యాదతో జూచుచుండిరనుటకు బెక్కు దృష్టాంతములు గలవు. మతకార్యములలోను స్త్రీలే ప్రాముఖ్యరాండ్రుగ నుండుచువచ్చిరి. ఏమతమవలంబించినను స్త్రీలే మార్గదర్శనులుగా నుండిరి. పురుషులకన్నను స్త్రీలకే మతాభినివేశమధికముగా నుండెను. సర్వసామాన్యముగా పురుషులే స్త్రీలకు వశులై వర్తించుచుండిరి.

విశేషాంశములు

ధాన్యకటక బౌద్ధ స్థూపములలోని దానశాసనములలో రెండు విచిత్రములయిన సంబంధమును దెలుపునవిగా నున్నవి. తోళ్ళపనిచేయువాడును నాగమ