కుమ్మర పనులు.
ఆ కాలపునాటి యిటుకలను మఱికొన్ని కుమ్మరపనులను పరిశోధించిన స్యూయలు గారె మరల నిట్లు వ్రాయుచున్నారు.
"ఆ కాలపు నాటి కుమ్మరులీ కాలపు నాటి వారికన్న నధిక చాతుర్యము కలవారని నాకు దొరకిన పగిలిపోయిన కుండముక్కలు మొదలగునవి తేట పఱచుచున్నవి. అయ్యది నిస్సంశయముగా నిర్వివాదాంశమని నేననుకొనుచున్నాను. కొన్ని కుండలయొక్క మూతులు మూడనాలు గడుగులు నడిమి కొలత గలిగి మిక్కిలి పెద్దవిగానుండి ధాన్యము మొదలగునవి నిలువజేసుకొనుట కనుకూలముగా నుండి యుండబోలు. కొన్ని మిక్కిలి సొగసుగా నగిషీ చేయబడినవిగా నున్నవి "
సముద్ర మార్గములు - రేవు పట్టణములు.
ఆంధ్రరాజుల పరిపాలనములో విదేశముతోడి వర్తకవ్యాపారము సముద్రమార్గముల నడుపబడుచుండె ననుటకు దృష్టాంతము లనేకములు గలవు. అరేబియా, ఈజిప్టు, రోము, గ్రీసు, పారశీకము మొదలగు పశ్చిమ దేశముల నుండి యోడలు పశ్చిమ సముద్రతీరమందలి భరుకచ్చము, సింహపురము, శూర్పరూగము మొదలగు రేవు పట్టణములకు వచ్చుచుండెను. భరుకచ్చము నేడు బ్రోచి (Broach) యని పిలువబడుచున్నది. ఇచ్చటినుండి సింహళమునకును సింహళమునుండి గంగానదీ ముఖద్వారము నందుండిన తామ్రలిప్తి నగరమునకు సముద్రమార్గము కలదు. ఈ మార్గమున నోడలు రాకపోకలు సలుపుచుండెను. తామ్రలిప్తి నగరమున బయలువెడలిన యోడ తూర్పుతీరము వెంబడిని వచ్చి కళింగదేశములోని రెండురేవు పట్టణములను ఆంధ్రదేశములోని రెండు రేవుపట్టణములను జూచుకొని చోళదేశపు తీరము ప్రక్కనే సింహళద్వీపమునకు బోవుచుండెను. కళింగదేశములోని ప్రధానమైన రేవుపట్టణము అడ్జిటాయనునది గానున్నది. ఈ పేరు బర్మా దేశపుగాథలలో గానుపించుచున్నది గాని కళింగ దేశము లోని యేపట్టణమునకు వర్తించునో దెలియరాకున్నయది. బర్మాదేశమునుండి "తా