యా కాలపు నాటి యాంధ్రులకు నోడలనుగూర్చియు, నావికాయాత్రలనుగూర్చియు, జ్ఞానము కలదనియు, ఆ విషయములందు వారాఱితేఱిన వాఱేయనియు స్పష్టముగా జెప్పుటకు సంశయింపం బనిలేదు. ఈ నాణెములుగాక యాకాలము నందు గవ్వలు మొదలగునవి కూడ వ్యవహారమునం దుపయోగింపబడుచుండినవి.
విశేషానుభవముగల మణికారకులు.
విశేషానుభవముగల మణికారకులని (రత్నవర్తకులు, పూసలవర్తకులు, రత్నములు సానపట్టువారు మణికారకు లనంబడుదురు) రాబర్టు స్యూయలు గారాంధ్రులను గూర్చి వ్రాసియున్నారు. ఈ విషయమున రాబర్టు స్యూయలు గారాంధ్రులకిచ్చిన యోగ్యతా పత్రిక చదువరుల కాహ్లాదకరముగా నుండునని దాని నీ క్రింద నుదాహరించుచున్నారము.
"నాకు దొరకిన పూసలు రేగడిమట్టితో జేయబడి యెండ బెట్టబడినవిగను, బంకమట్టితో జేసి కాల్చినవిగను, ఎముకతోడను, స్ఫటికముతో డను, గాజుతోడను, తృణమణితోడను, కెంపులతోడను, వివిధములయిన ఱాళ్లతోడను జేయబడినవిగను నున్నవి. కొన్ని చిన్నవిగను కొన్ని పెద్దవిగను పెక్కుతరహాలుగ నున్నవి. వానిలో ముఖ్యముగా ఱాళ్లతోడను జేయబడినవి సొగసయిన పనివానితనమును దెలుపునవి గా నున్నవి. స్ఫటికముతో జేయబడిన గిన్నెయొక్క చిన్న భాగమును ఎముకతో జేయబడిన హస్తకంకణములయొక్క యొకటి రెండు ముక్కలును, నునుపు చేయబడిన యొకటి రెండు చిన్న ఱాళ్లును, అటువంటివస్తువులె మఱికొన్ని యునుగూడ దొరకినవి. ఇవియన్నియు నాకాలపునాటి మనుష్యులు విశేషానుభవముగల మణికారకులని ఋజువు చేయుచున్నవి. ఈ వస్తువులన్నియును వీరిచే కృష్ణామండలములోని గుడివాడవద్ద గనుగొనబడినవేగావున నీయోగ్యతాపత్రిక యాంధ్రులకె చెందునదిగాని మఱియొకరికి గాదు. [1]
- ↑ Archeological Survey of India, New Imperial Series Vol. XV. page 20.