Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలనము చేసికొనుచుండుట అప్పటి రాజ్యాంగపద్ధతిలో ప్రధానమైన విషయముగా నుండెను. పైనుదాహరించిన భట్టిప్రోలు శాసనములోని నిగమసభ మాత్రమే గాక ఋషభవత్తుని నాసిక శాసనములో గోవర్థనములోని నిగమ సభ యొకటి పేర్కొనబడి యుండెను. దేశములో నెట్టెట్టి విక్రాంతులు సంభవించినను, పరిపాలనచేయు రాజు లెట్టివారయినను నిరాఘాటముగ రాజ్యపాలనమునడుచుటకు నిట్టి సభలు తోడ్పడుచుండియనుటకు సందియములేదు. ఆ కాలమునందు నూటి కైదుమొదలుకొని యేడున్నర వఱకు మాత్రమే వడ్డి గైకొనబడుచుండెను గాని యీ కాలమునందువలె నధికమైన వడ్డి గైకొనబడుచుండలేదు.

నాణెములు.

ఆంధ్రరాజుల కాలమున నాణెములు సీసముతోడను, రాగితోడను వెండితోడను చేయబడినవిగా నున్నవి. దీనిలో పెక్కువేల నాణెములు ధరణి కోటలోను, గుడివాడ ప్రాంతమునను దొరకినవి. కొన్ని నాణెములను రాబర్టు స్యూయలు గారు సంపాదించి జనరల్ కన్నిహ్యామ్ గారికి బంపగా నయ్యవి గోతమీపుత్రశాతకర్ణి యజ్ఞశ్రీశాతకర్ణి, చంద్రశ్రీశాతకర్ణి కాలమునాటి వై యున్నవని వారు కనుకొనిరి.పశ్చిమ భాగమున ననగా నిప్పటి మహారాష్ట్ర దేశమునందును భగవనా లాలా ఇంద్రాజి పండితునిచేతను గిబ్బుగారి చేతను కనుగొనబడినవి.అవియును గోతమీపుత్రునియొక్కయు, యజ్ఞశ్రీయొక్కయు, పులమావియొక్కయు, వారి ప్రతినిధి పరిపాలకులయొక్కయు నాణెములుగా నున్నవి. పశ్చిమదేశమున దొరకిన యాంధ్రనాణెములపైన విల్లునంబులు చిత్రింపబడినవిగానున్నవి.

స్యూయలు గారు గుడివాడలో గనుగొనిన కొన్ని నాణెములు చిత్రములుగా నున్నవి. రోమనులయొక్కయు, యవనులయొక్కయు ఓడలనుబోలిన యోడయొకటి అర్థచంద్రాకృతిగల టాపుతోడను రెండు తెఱచాపలతోడను, తెడ్డువలెనుండు నొక పెద్దలంగరు (చుక్కాను) తోడను జిత్రింపబడినవిగా నున్నవి. ఇయ్యవి యజ్ఞ శ్రీకాలమునాటినవిగా నున్నవి. ఈ నాణెమునుబట్టియె