పదవప్రకరణము
పునర్విమర్శనము
- - -:o:- - -
ఆంధ్రసామ్రాజ్య విస్తీర్ణము
ఆంధ్రరాజులు మగధసామ్రాజ్యమును గైకొని పాలించిరని పురాణములు బలిద్వీపవాసులును, యవద్వీపవాసులును, వీరిని ఇండియా చక్రవర్తులని పేర్కొని యుండుటయును, పాండ్యచోళ కేరళములను బాలించిరన రాజులు వీరిని మగధ రాజులని పేర్కొనియుండుటయు ఆంధ్రసామ్రాజ్యమున మగధ రాజ్యము చేరియున్నదని చెప్పుటకు ప్రబలసాక్ష్యములుగానున్నవి. మధ్యదేశము, కళింగదేశము, దక్షిణకోసలము, విదర్భదేశము, కొంకణదేశము, మహారాష్ట్రదేశము, దక్షిణకుంతలదేశము, ఇంతయేల, పాండ్య చోళ కేరళ దేశములు దక్క తక్కిన దక్షిణాపథ దేశములన్నియు నాంధ్రసామ్రాజ్యమున జేరియున్నవని చెప్పవచ్చును. వనవాసి రాజధానిగ జేసికొని యాంధ్రరాజులు రాజప్రతినిధిగ నుండి దక్షిణకుంతల దేశమును బాలించిన హరితపుత్ర శాతకర్ణ పేరుగల దానశాసనములు మైసూరునందు రైసుదొరగారి వలన నూతనముగా గనిపెట్టబడినవి. కనుక నాంధ్రరాజులగు శాతకర్ణులు మైసూరును కూడా పాలించినట్లు స్పష్టపడున్నది. అసిక, అస్మక, మూలక, మహారాష్ట్ర, కుకుర, అచిరాంత, అనూప, విదర్భ, అకరావంతి దేశములను గోతమిపుత్ర శాతకర్ణి జయించెనని నాసికశాసనములో నొకదానిలో నుదహరింపబడి యుండెను. అస్మక మౌలికదేశములు దక్షిణాపథ దేశములోనివివని పురాణములు చెప్పుచున్నవి. [1]
- ↑ 1. The Madras Journal of Literature and Science 1886-87 pp 56 to 62; Archeological Survey of India(New Series) Vol III p.25,28.