పుట:Andhrula Charitramu Part-1.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుంటూరులో కమీషనర్ గా నుండుట తటస్థించెను. ఆయనగారు కర్నల్ మెకంజిగారు పూనిన పనిని తామవలంబించి పనిచేయుటకు నిశ్చయించుకొనిరి. ఆయనగా రదివఱకు ద్రవ్వి యుండని ప్రదేశమును త్రవ్వించి సొగసుగా విగ్రహములు చెక్కబడిన ఱాతిపలకల నెన్నిటినో పోగుచేసి చెన్నపురికి బంపగా నయ్యవి పదునాలుగు సంవత్సరముల వఱకు వానకు నాని యెండకు వెండి తుదకు 1852 వ సంవత్సరమున నింగ్లాండునకు గొనిపోబడినవి. దురదృష్ణవశము చేత నయ్యవి హిందూదేశములో సిపాయీల కలహము ప్రారంభమయిన కాలమనగా ప్రాతదయిన "ఈస్టుఇండియా కంపెనీ" అంతరించి " న్యూ యిండియా కవున్సిల్" ఏర్పడుటకు నడుమ బంపబడిన వగుట చేత వానికి స్వాగతమిచ్చి యాదరించువారు లేకపోయినందున ఫైఫ్‌హావుసు(Fife House) యొక్క కోచిహవుసు(Coach House) లో ద్రోసివేయబడినవి. పనికిమాలిన చెత్తలో గొంతకాల మణగి మణగి యుండి 1867వ సంవత్సరమున డాక్టరు ఫర్యూసను గారి పాలబడుట తటస్థించెను. ఆయనగారు డాక్టరు ఫోర్బోస్, వాట్సన్ మొదలగు వారియొక్కయు, వారియుద్యోగస్థుల యొక్కయు సహాయముతో వాని నన్నిటిని బయులునకు దెప్పించి తేజోలేఖనము (photograph) గావించిరి. ఆ సాధనములతో ఫర్యూసన్ గారు అమరావతీ స్తూపమునువశము జేసికొనుటకు గృషి చేసిరి. అటువంటి పురాతన చైతన్యములయొక్కయు, నూతన చైత్యములయొక్కయు జ్ఞానమాయన కలిగియున్నను ఇందు విజయముగాంచక పోయియుందురు. కాని యాకట్టడముల యొక్క తేజోలేఖనములలోనే కట్టడములోని భాగములయొక్క ప్రతిరూపములు సరిగా జిత్రింపబడినవి గానవచ్చుటచేత వారికి గట్టడముయొక్క ప్రతిరూపము గన్నులకు బొడగట్టినది. వీనిసహాయము చేత విగ్రహములు గల ఏఱాతిపలక లేభాగమునం దుండినవో తెలిసికొన గలిగిరి. అమరావతీస్తూపము యొక్క స్థల నిర్దేశ మీ క్రిందిపటమువలన మీకు సులభముగా బోధపడగలదు.