ఈ పుట ఆమోదించబడ్డది
ఈ శాసనమునందు కమ్మకరాఠ విషయము పేర్కొనబడినది. రాఠయనగా రాష్ట్రము; కమ్మకరాష్ట్రము-జగ్గయ్యపేటకు బడమట నిజాము రాజ్యములో కమ్మమెట్టు గ్రామము కలదు. దాని చుట్టునుండు ప్రదేశమునకే కమ్మకరాష్ట్రమని పేరు గలిగియుండచ్చును గనుక నీ మాధారిపుత్త్ర పురుషదత్తుడాంధ్ర భృత్యవంశానంతరము స్వతంత్రుడై కొంత భాగమాక్రమించుకొని పాలించుచుండిన పల్లవుడైయుండవచ్చును.
చరిత్రము తెలియంబడని యాంధ్రరాజులు -ఆనందుడు.
గోతమిపుత్త్ర శాతకర్ణి పరిపాలన కాలమున వాసిష్ఠీ కుమారుడయిన యానందుడనువాడు సాంచితోపుయొక్క దక్షిణద్వారము మీదనేదోదానము చేసినట్లుగ వ్రాయబడియున్నది. ఈతడు గోతమిపుత్త్ర శాతకర్ణియొక్క కడగొట్టు కొడుకని జనరల్ కన్నిహ్యామ్ గారు వ్రాయుచున్నారు.
హరితిపుత్త్ర శాతకర్ణి.
వీని పేరు బనవాసిలోని శాసనమునందు గానంబడుచున్నది. వాని వంశము పేరు సందిగ్ధముగనున్నది గాని స్పష్టముగ దెలియుచుండలేదు.[1] [2]