పుట:Andhrula Charitramu Part-1.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దెలియరాదు. వీరు మాత్రము పురాణములలో బేర్కొనబడినవారు. అయినను పెక్కండ్రు రాజుల పేరులు వినవచ్చుచున్నవి గాని వారల చారిత్రము వినబడదు.

పార్వతీయాంధ్రులు.

ఆంధ్రభృత్యవంశము నశించిన వెనుక నా వంశములోని మఱియొక శాఖ వారయన యేడుగురాంధ్రులు రాజ్యభారమును వహించి పరిపాలింతురని సూచించెడి "ఆంధ్రాణాం సంస్థితా(తే?) రాజ్యేతేషాం భృత్యాన్వయోనృపాః సప్తైనాంధ్రా భవిష్యంతి."అను వాక్యము మత్స్యపురాణమునందు గానంబడుచున్నది. ఇటువంటి శ్లోకము వాయుపురాణమున సహితము గానంబడుచున్నది గాని యా భాసముగానున్నది. మాధారి పుత్త్ర శకసేనుడా శాఖలోనివాడేమో?

మాధారిపుత్ర్త పురుషదత్తుడు.

వీనిపేరుగల శాసనమొకటి కృష్ణామండలములోని జగ్గయ్యపేట స్తూపమునందు గానంబడుచున్నది. [1] ప్రసిద్ధికెక్కిన యిక్ష్వాక వీరుడును మాధారయొక్క పుత్రుడునగు పురుషదత్తునియొక్క 21వ పరిపాలన సంవత్సరమున వర్షఋతువుయొక్క యెనిమిదవ పక్షమున దశమినాడు మహాకాండూర గ్రామనివాసీయును కమ్మకరాఠ విషయమున నడాతూర గ్రామవాసియగు నాగచంద్రునియొక్క కుమారుడును, ఆవేశనియునగు సిద్ధార్థుడు తన తల్లి నాగలానితోడను, తన భార్య సముద్రాణితోడను, కుమారుడు మూలశ్రీతోడను, కుమారిక నాగబంధునిక తోడను, సోదరుడు బుద్ధనికుని తోడను, వాని భార్య తోడను, వారి యిరువురు పుత్త్రులగు నాగశ్రీ, చంద్రశ్రీ తోడను, సిద్థార్థినికయొక్క కూతురితోడను వేలగిరి గ్రామమునందుండిన రక్తబంధువులతోడను, మిత్రులతోడను గలిసి బుద్ధుని చైత్యము యొక్క ప్రాక్ద్వారము సమీపమున ప్రాణికోటి యొక్క క్షేమము నిమిత్తము ఆయకస్తంభముల నైందింటి నిర్మించి దానము చేసెనని చెప్పబడియున్నది. ఈ మాదారిపుత్త్ర పురుషదత్తుడును ఇక్ష్వాకు వంశజుడని చెప్పబడియున్నను సంకర సంతానకోటిలోని వాడేయని చెప్పవచ్చును.

  1. Burgess Amrawati & Jaggayyapeta Stupas., p.III