దూరమును జెప్పుటలో నిశ్చయముగా బొరపడి యుండవచ్చును. ఆ చెప్పిన దూరపరిమాణము, స్యెంఠోకియా (కోసలము)(-Sh-yen-toh-kia) యొక్క రాజధానినుండియో, లేక కోసలముయొక్క సరిహద్దు నుండియో నిర్ణయించుటకుగూడ నతని వాక్యము సందిగ్ధముగా గన్పట్టుచున్నది. చీనాయాత్రికులిరువురు వ్రాసిన స్థల చరిత్ర వర్ణనలు శ్రీశైలముమీది శివాలయమున కన్వయించుచున్నవి. శ్రీశైలమునకు శ్రీపర్వతమని సంస్కృతభాషా గ్రంథములయందు దఱచుగా వాడబడియున్నది. శ్రీపర్వతమను పేరు టిబెట్ గ్రంథములయందు గానంబడుచున్నది. శ్రీశైలశివాలయము ప్రాచీనమైనదని చెప్పెడు గాథలనుగూడ దీనిని బలపఱచుచున్నవి. ఎన్నివిధములచేత జూచినను చీనాదేశపు యాత్రికులిరువురి యొక్క వర్ణనలు దీనికేయన్వయించుచున్నవి గనుక మన యజ్ఞశ్రీశాతకర్ణి నాగార్జునునికొఱకు నిర్మించిన బౌద్ధసంఘారామమిదియే యని మఱియొక మాఱు పేర్కొనుచున్నారము.
నాగార్జునాచార్యుడు.
సింహళ ద్వీపములోని అనూరాధపురమునందలి రాన్వెల్లిదాగాబా ప్రతిష్ఠాపనోత్సవమునకు కాశ్మీరము, కాబూల్, హిందూదేశముయొక్క వివిధభాగములనుండియు 18800 మంది భక్తులు వెళ్ళియుండగా మహదేవమహర్షి పల్లవుల దేశములనుండి 460000 మంది భక్తులను వెంటగొనిపోయియుండెనని యైదవ శతాబ్దమునందు రచింపబడిన మహావంశమను బౌద్ధుల చరిత్రమునందు వ్రాయబడినది. ఇందలి సంఖ్య నమ్మదగినది కాకపోయినను హిందూదేశములో నేభాగముకంటెను హిందు ద్వీపకల్పముయొక్క తూర్పు భాగమునందు బౌద్ధమతము పూర్వకాలమున వర్ధిల్లుచుండెనని విశ్వసించుటకు మాత్రమవకాశమిచ్చుచున్నది. బౌద్ధమతాచార్యుడగు నాగార్జునునకు పోషకుడు (దానపతి) గా నుండి తన రాణియొక్క తంత్రమునకు వశుడైయామె యొక్క కొడుకు సుశక్తియనువానికి సింహాసనమును కట్టబెట్టుటకై ప్రయత్నించి తనయాచార్యుడైన నాగార్జునుడు మరణమునొందిన కాలముననే మరణమునొందిన రాజు సో-