Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్సరమున సుదర్శన సరస్సుయొక్క గట్టు తెగిపోయెనని తన శాసనమునందు జెప్పియుండుటచేత నా సంవత్సరము శకకాల సంవత్సరమయి యుండును. కనుక నయ్యది క్రీస్తు శక కాలము 150దవ సంవత్సరముగా నుండెననియు, అయ్యది చెఱువు కట్ట తెగిపోయిన సంవత్సరమని మాత్రమె చెప్పియుండుటచేత నా శాసనమాసంవత్సరము వ్రాయబడినది కాదనియు, అందలి విషయములంతకు బూర్వము జరిగినవి కావనియు, డాక్టరు భాండార్కరుగారు చెప్పెడు హేతువులే సరియైనవయిన పక్షమున రుద్రదాముడు జయించినది గోతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణియనియె చెప్పదగునుగాని లేనియెడ రుద్రదామునిచే జయింపబడినవాడు వాసిష్ఠిపుత్త్ర చతుష్పర్ణ శాతకర్ణియై యుండవచ్చునని భావించుచున్నారము. ఈ గోతమి పుత్త్ర యజ్ఞ శ్రీ శాతకర్ణి పేరుగల శాసనములు నాసిక, కార్లి, చినగంజాము మొదలగు ప్రదేశములందు గానంబడుటచేత నీతనికాలమున గూడ నాంధ్రరాజ్యము బహుదూరము వ్యాపించియున్నదని విశ్వసింపవచ్చును. ఈతడును మొదటి గోతమిపుత్త్రుని వలెనె మిక్కిలి పరాక్రమముగలవాడుగా నుండెను. అతని వలెనె యీతడును బౌద్ధబ్రాహ్మణ మతముల రెంటియందును సమానాదరము గలవాడుగ నుండి విఖ్యాతి గాంచినవాడుగ గన్పట్టుచున్నాడు. బుద్ధుని తరువాత బౌద్ధమతాచార్యులలో సుప్రసిద్ధుడయిన నాగార్జునాచార్యులీ యజ్ఞశ్రీశాతకర్ణి కాలముననున్నట్లు గాన్పించుచున్నది.

శ్రీశైల బౌద్ధసంఘారామ నిర్మాణము.

ఏడవ శతాబ్ద మధ్యమున హిందూదేశమునందలి బౌద్ధ మతస్థితిని దెలిసికొనగోరి చీనాదేశపు యాత్రికుడగు హౌనుత్సాంగు హిందూదేశమును జూడవచ్చి కొంతకాలము దేశయాత్రలు చేసి వెడలిపోయి వ్రాసిన హిందూదేశ యాత్రా చరిత్రమునందు దక్షిణ కోసల వృత్తాంతమును దెలిపిన వెనుక కోసలము