Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు బ్రాహ్మణులకు భూములు మొదలగునవి యొసంగి యనేక బ్రాహ్మణులను ఆంధ్రదేశమునకు రప్పించినట్లు గానంబడుచున్నది. ఇతడు మతసంస్కరణమున గ్రొత్తత్రోవను తొక్కినవాడని చెప్పవలసియున్నది. వీని మాతామహుడును, మాతులుడును, తల్లియును మొదల పహ్లవజాతికి సంబంధించినవారయి యాంధ్రులలో గలసిపోయి పల్లవులని పిలువంబడుచుండెడివారని తోచుచున్నది. ఆ కాలమునందు పల్లవనాయకు లనేకులాంధ్రులకడ దండనాధులుగను, రాజప్రతినిధులుగను, మంత్రులుగను నుండి వారలతో సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరని యాకాలపు చరిత్రమునుబట్టి మనము సులభముగా దెలిసికొనవచ్చును. ఈ కడపటి యాంధ్రరాజులలో గొందఱు పల్లవులతోడి సంబంధముచేత దాము పల్లవ వంశజులమని డంబముతో జెప్పుకొనుచుండిరి. ఆ పల్లవ వంశమునకు గౌరవము కలుగుటకై యే భరద్వాజ ఋషికో, ఏ యిక్ష్వాకునకో, ఏ సూర్యచంద్రులనో ముడిపెట్టుచుండిరి. ఆంధ్రరాజుగనుండిన శివస్కందుని గూర్చి యిచ్చట చెప్పవలసినదింతకన్న నేమియు లేదు. పల్లవరాజుగనుండిన శివస్కందునిగూర్చి మాత్రము పల్లవ వంశమును గూర్చి వ్రాయు ప్రకరణమున జర్చింపదలచి ప్రస్తుతమిట విరమించుచున్నారము.

గోతమిపుత్రయజ్ఞశ్రీశాతకర్ణుడు.

(క్రీ.శ. 172 మొదలుకొని క్రీ.శ.205 వఱకు)

బహుకాలము పరిపాలనము చేసి విశేషకీర్తిని సంపాదించిన యాంధ్రరాజులలో గోతమిపుత్ర్త యజ్ఞశ్రీ శాతకర్ణుడొకడు. వీని తల్లి గోతమి. ఈమె యుజ్జయినీ క్షాత్రపుల యింటియాడపడచు. మహాక్షాత్రపుడు రుద్రదాముని కూతురయినంగావచ్చును. అట్లయిన పక్షమున వాసిష్ఠీపుత్త్ర చతుష్పర్ణ శాతకర్ణుడు యజ్ఞశ్రీ శాతకర్ణునకు దండ్రికావలయును. ఇతడు పులమాయి, శివశ్రీ, శివస్కందుడు వరుసగా రాజలై పరిపాలనము సేయునపుడు యువరాజుగను, రాజప్రతినిధిగను ప్రతిష్ఠానముననుండి క్రీ.శ.154వ సంవత్సరము మొదలుకొని క్రీ.శ.172వ సంవత్సరము వఱకును మహారాష్ట్ర దేశమును బరిపాలించి 172వ సంవత్సరము మొదలుకొని క్రీ.శ.205వఱకును ఆంధ్రరాజ్యమునకభిషిక్తుడై పరి