Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రమెగాదు. శివశ్రీ పేరుగూడ వాయుపురాణము పేర్కొనియుండలేదు. వాయుపురాణము పేర్కొనక పోయినను శివశ్రీయును, శివస్కందుడును ధాన్యకటకము రాజధానిగా నాంధ్రరాజ్యమును బరిపాలించినది వాస్తవమేగాని శివస్కందుడు మాత్రము ధాన్యకటకమును విడిచి కాంచీపురమునుగూడ రాజధానిగ జేసికొని పరిపాలన చేసినట్లు గానంబడుచున్నది. శివస్కందుడు బ్రాహ్మణ మతమవలంబించినవాడుగ గానంబడుచున్నాడు. ఇతడు శివశ్రీయొక్క కుమారుడేమోయని సందియము కలుగుచున్నది. శివశ్రీ పేరు భాగవత పురాణము వేదశ్రీయని పేర్కొనుచున్నది. వేదశ్రీ యను పేరు నానాఘట్టము గుహలోనొక శాసనమున గానంబడుచున్నది. శివశ్రీ యనునతడే వైదిక మతమవలంబించి వేదశ్రీయను పేరుపెట్టుకొనెనేమో యోజింపవలసియున్నది. ఆ శాసనమునందు వేదశ్రీయనువాడు పవిత్రములయిన యాహుతుల గొన్నిటిని సమర్పించెనని చెప్పబడియున్నది. [1] ఈశాసనమును బరిశోధించినవారు దానిని బూర్ణముగ దెలిపియుండలేదు. విశేషభాగము శిథిలమైయున్నది. కాబట్టి వేదశ్రీయను వాడు యజ్ఞయాగాది కర్మలనాచరించెనని చెప్పదగును. శివస్కందుడు బ్రాహ్మణ మత అవలంబించుట చూడగా వేదశ్రీయొక్క తనయుడేమోనని సందియము గలుగుచున్నది. అయినను కాకపోయినను శివస్కందుడు మాత్రము మిక్కిలి బ్రాహ్మణమతాభిమానము గలవాడనుటకు సందియములేదు. ఆ కాలమునందలి శకరాజులును పహ్లవరాజులును బ్రాహ్మణమత మవలంబించుట చేతను, ప్రజాపరిపాలకులుగ నుండుట చేతను బ్రాహ్మణులు వారిని క్షత్రియులనుగా నంగీకరించి వారిని తమ స్వాధీనము జేసికొన బ్రయత్నించుచున్న కాలమగుటచేత నీరాజులందఱును బ్రాహ్మణులకు శర్మ వలెనె తమ నామములకు వర్మ యనుదానిని జేర్చుకొని యార్యక్షత్రియులమని లోకమునకు విశదపఱచుటకో యన బ్రాహ్మణమతము పట్ల విశేషాభిమానముంజూపుచు, బ్రాహ్మణ మతమును విజృంభింపజేయుచుండిరి. అటువంటి వారిలో శివస్కందుడొకడుగ గన్పట్టుచున్నాడు.

  1. J.R.A.S.Vol.V., p.287; Jour, Bom, Branch Roy As soc; Vol.XIII., p.404 and Vol.xiii., pp.310.312.