ఈ పుట ఆమోదించబడ్డది
దుర్కొని వానినోడించి వాని తల నఱికివైచెను. ఈ గాథలోని శాలివాహనుడే శ్రీపులమాయియనియు, విక్రమార్కుడే శ్రీ జయదాముడనియు నెఱుంగ వలయును.
ఈ పై జెప్పబడిన జయదాముని కుమారుడు రుద్రదాముడను మమాక్షాత్రపుని కూతురు దక్షమిత్రయనునామె శ్రీ పులమాయి శాలివాహనునికిచ్చి వివాహము చేయబడినదనియు, రుద్రదాముడు రెండుసారులు పులమాయిని యుద్ధములోనోడించినను అల్లుడగుటచేత వాని దేశమునాక్రమింపక విడిచిపెట్టెననియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాసియున్నారు. ఇది శాసనములలో జెప్పినదానికి మఱికొన్ని చరిత్రాంశములకును విరుద్ధముగా గానంబడుచున్నది. [1]
- ↑ పురాణములలోనీయబడిన యాంధ్రరాజుల పేరులను వారు పాలించినకాలమును బరస్పర విరుద్ధములుగ నుండుటచేత, పురాణములలోనుదాహరింపబడిన పేరులు కొన్ని శాసనాదులలో గాన్పింపకుండుటచేతను, మఱికొన్ని పేరులు మార్పులతో గన్పట్టుట చేతను, కొన్ని స్థలములందు పురాణములలో నుదాహరించిన కాలమును, శాసనములలోనుదాహరించిన కాలమును సరిపోకపోవుటచేతను, కడపటి యాంధ్ర రాజులు శాతకర్ణియను శబ్దమును సామాన్యముగా దమ నామముల కడను జేర్చుకొనియుండుటచేతను, కొందఱు గోతమి, వాసిష్ఠి, మాధారి, హారితియని తల్లుల నామములను తమ నామములకు ముందుజేర్చుకొని పిలుపించుకొనుచుండిన వారగుటచేతను, కొందఱు తండ్రుల కాలముననే యువరాజులుగను, రాజప్రతినిధులుగను నుండి వేఱ్వేరు దేశములను బాలించినవారుగ నుండి యుండుటచేతను కాలనిర్ణయము జేయుటకు బ్రహ్మముడివలె నుండి పాశ్చాత్యపండితులకు హైందవ పండితులకు గూడ స్వాధీనముగాక నవ్వులపాలు చేయుచుండెను. ఈ బ్రహ్మముడిలోని చిక్కును దీయుటకు మాఱుగా కొందఱు పాశ్చాత్య పండితులు క్రొత్తచిక్కులను గల్పించి మరింత దుస్సాధ్యమగునట్లు గావించిరి. కనుక సరియైన కాలనిర్ణయము చేయుటకిదివఱకు దొరకిన సాధనములబట్టి యెవ్వరికిని సాధ్యపడదు.