Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ది మొదలుకొని దక్షిణమున గాంచీపురము వఱకునుగల దేశమంతయు నాంధ్రరాజుల వశముననున్నట్టు గన్పట్టుచున్నది. ఆంధ్రులకాలమున మగధరాజ్యమునకు రాజధాని ధాన్యకటకనగరముగానుండెను. ఆ కాలమునందు సింహళరాజగు గజబాహువునకును చేరరాజగు చెంకుడ్డువానునకును మగధరాజగు శాతకర్ణికిని విశేషమైత్రి గలిగియుండెను. అదియేమి చిత్రమోగాని యేమి సంబంధబాంధవ్యములచేతనో గాని సింహళరాజులును పాండ్యచోళచేర రాజులును ఆంధ్రరాజులును బహుశతాబ్దముల వఱకన్యోన్య మైత్రి గలిగియుండిరి. ఈ మైత్రి శివస్కందవర్ముని పరిపాలనమున భగ్నమైనట్లుగ గన్పట్టుచున్నది. ఆంధ్రరాజులు మిత్రులుగ నుండుటచేత చెంకుడ్డువాన్ చేరరాజు మృతభర్తృకయగు తన తల్లి శోణయను నామెకు గంగాస్నానమును లభింపజేయ నామెను వెంటబెట్టుకొని యాంధ్రదేశము మీదుగా బోయి కృతకృత్యుడయ్యెనని పై కావ్యమునందు వర్ణింపబడినది. కొన్ని సంవత్సరములయిన తరువాత నొకనాడు చేరరాజు తన రాణియగు వేణుమాలతో వనవిహారమునకు బోయి పెరియార్ నదిలోని యిసుకతిన్నెలపై నివసించు కాలమున పార్వతీయులు కొందఱువచ్చి "దేవా! ఎవ్వతయో యొక్క వనిత యేకస్తనయై వెంకై చెట్టునీడన విగతప్రాణియై పడియున్నది. ఆమె యుదంతమింతయు దెలియరాదు" అని విన్నవింపగా రాజు పరివారములోనుండిన "చాతాన్" అను సరసకవియా కథనెఱింగినవాడు కావున రాజునకును రాణికినిట్లు శ్రుతపఱిచెను. ఆమె కావీరిపద్దినములోని యొక వర్తకుని భార్యగానుండెను. ఆ వర్తకుడొక యాటకత్తె మోహములో జిక్కుకొని తన యైశ్వర్యమునంతను గోలుపోయి పశ్చాత్తప్తుడై పతివ్రతయగు భార్యతో మధురాపురమునకు వచ్చి భార్యకడ విలువగల యందెల జతమాత్రముండుట జూచి యొక దాని విక్రయించి యా సొమ్ముతో మరల వర్తకము ప్రారంభింపబూని భార్యకు దెలియజెప్పగా నామె సంతోషపూర్వకముగా దానినొసంగిన నదిగైకొని తన దురదృష్టముచేత నంతకుబూర్వము మధురాపుర రాజ్ఞియొక్క యందెను దొంగిలించిన స్వర్ణకారునికడకు బట్టుకొనిపోయెను. వాడు రాణియొక్క యందెను తస్కరించిన దొంగ వీడేయని వెంటనె రాజభటులకు