పుట:Andhrula Charitramu Part-1.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఎనిమిదవ ప్రకరణము.

గోతమిపుత్ర శాతకర్ణ శాతవాహనుడు.

(క్రీ.శ. 133 మొదలుకొని 154 వఱకు.)

- - -

ఇతడు శివస్వాతికి దరువాత నాంధ్రరాజ్యలక్ష్మిని వరించి పట్టము గట్టుకొన్న మహనీయుడు. ఇంతకు బూర్వము రాజ్యము చేసిన శాతకర్ణులవలెగాక "గోతమిపుత్ర"యని తన పేరునకు బూర్వమున నొక విశేషణమును జేర్చి వాడుకొనుచుండుటచేత నిందొక విశేషము గన్పట్టుచున్నది. పూర్వమునందుండిన వారెవ్వరును తల్లుల పేరులతో దమ పేరులను జేర్చి వాడుకొని యుండకపోవుటచేత నీతడు గోతమిపుత్రుడని తల్లిపేరు చెప్పుకొనుటచేత నితడు శాతవాహనవంశములో నిదివఱకు రాజ్యము చేయుచుండిన శాఖలోనివాడు గాక మఱియొక శాఖలోని వాడైయున్నట్లుగ గన్పట్టుచున్నది. ఏ శాఖలోనివాడైనను నితడు శాతవాహన వంశములోనివాడేగాని యన్యుడుగాడు. మఱియు సామాన్యుడుగాడు. ఇతడు పార్థునివంటి మేటియోధుడు; పరాక్రమంబున విక్రమార్కుని మించినవాడు; ప్రజ్ఞయందు గృష్ణదేవరాయసదృశుడు; బుద్ధదేవుని ప్రియభక్తుడయినను పరమతసహనము గలవాడు. పూర్వుల కీర్తి నిలుపగోరువాడు. ఇతడు కృష్ణదేవరాయని వలె దిగ్విజయము జేసి బహుదేశములను జయించి బహుభూములు పాలించి యపజయమన్నమాట యెఱుంగక శత్రువులకజేయుడై యాతనివలెనె యిరువదియొక్క సంవత్సరములు మాత్రమె పరిపాలనము చేసి శాసనములు నెలకొల్పి జయస్తంభములునాటి లోకవిఖ్యాతి గాంచిన మేటి పరాక్రమవంతుడగుటచేత నితని చరిత్రము మనోహరమైనదనుటకు సందియములేదు. ఇతడు ధాన్యకటక నగరములో సింహాసనారూఢుడై రాజ్యపాలనము ప్రారంభించినతోడనే తన జ్యేష్ఠకుమారుడగు పులమాయి యువరాజును గోదావరీ తీరమునం