Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయినది యొక కొఱతగానె గన్పట్టుచుండెను. అయినను శివస్వాతి తన చేతనైనది యేమొ చేసియుండెను గాని కేవలము భీరువువలె నుండియుండలేదు. పైజెప్పిన విదేశరాజులు హిందూమతాచారముల నవలంబించి నాగరికులై పరిపాలింప సామర్థ్యము గలిగియుండుటకు విశేషకాలము పట్టకపోయినను స్వజాతిజనులు హిందూమతాచారముల నవలంబించి హిందువులలో గలిసిపోవుటకు విశేషకాలము పట్టకపోదు. అట్టి సమ్మేళన కాలమున దేశమున గలవరము జనించుట సహజమెగాని వింతకాదు. ఈ మ్లేచ్ఛజాతుల వారు హిందువులనడుమ గొంత కాలము నివసించియుండి క్రమముగా గొందఱు జైనమతమును, కొందఱు బౌద్ధమతమును విశేషసంఖ్యగలవారు శైవమతావలంబకులైరి గాని వారి దేహములందు మ్లేచ్ఛరక్తము ప్రవహించుచుండుటచేత నప్పటప్పట ఆంధ్రరాజులకు నధికశ్రమ కలుగ జేయుచునేయుండిరి.

శైవమత విజృంభణము.

శైవమతము మొదటననార్యులలో నుద్భవించి యార్యులచే నంగీకరింపబడి సంస్కరింపబడిన తరువాత కొంతకాలము వఱకు బౌద్ధమతముతో సమానగౌరవమును గాంచుచు విశేషజనానురాగమును సంపాదించి వర్థిల్లుచుండెను. ఆర్యులకనార్యులకు శైవమతము నడుమబ్రవేశించి సంబంధ బాంధవ్యముల గలుపుచుండెను. ఆర్యులు శైవమతము నాదరించుటచేత ననార్యులనేకులందు ముఖ్యముగా నాంధ్రద్రావిడులు శైవమతావలంబనము చేసి తన్మూలమున నార్యాచారముల గొంతవఱకు నవలంబించుచు నార్యులకు వశులై వర్తించుచుండిరి. ఆర్యులు శైవులను వశపఱచుకొని బౌద్ధులపై బురికొల్పి బౌద్ధులధికారుమును దేశమున దొలగింప సర్వవిధముల బాటుపడుచుండిరి. బ్రాహ్మణప్రేరితులై శైవమతాచార్యులనేకులు దేశమునడుమ నివసించుచుండిన యవనశకపహ్లవాదిమ్లేచ్ఛజాతులను శైవమతావలంబకులనుగాజేసి తమలో గలుపుకొనుచుండిరి. ఆర్యులభాషావాఙ్మయము దేశమున వ్యాపించుచుండెను. నాటనుండియు శైవము వీరశైవమగుచు జైనబౌద్ధమతములకు ప్రతిస్పర్థిగనుండెను. ఆర్యులు కేవలము శైవులలో గలియకపోయినను వారి దేవతల నార్యదేవతలను