Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(Modern Peshawar) రాజధానిగ జేసికొని తూర్పున బాటలీపుత్రము వఱకును, పశ్చిమమున హీరతు పట్టణము వఱకును గల దేశమును బాలించుటయెగాక బుద్ధధర్మము నవలంబించి బౌద్ధమత వ్యాపనము గావించి మిక్కిలి ప్రఖ్యాతి గాంచినవాడు. ఇతని కాలముననే శకయవనపహ్లవాదులు సింధుదేశమునుండి దిగువలకు వచ్చి ఘూర్జరము లేక సౌరాష్ట్రము (గుజరాథ్) మాళవము రెండు దేశములలోను స్థిరవాసము లేర్పరచుకొనుటయెగాక యాంధ్రదేశమునందును జొఱబడి కాపురములు గుదుర్చుకొనిరి. భూమకుడను క్షాత్రపుడు సురాష్ట్రమునందును, చస్తనుడను క్షాత్రవుడు మాళవదేశమునందును రాజ్యములను స్థాపించి కనిష్కునకు లోబడి పరిపాలనము సేయుచుండిరి. వీరు పహ్లవులుగా గన్పట్టుచుండిరి. సత్రాపు (Satraps) లను పేరు పారసీకరాజులకు గలదు. ఇంతియగాక వీరి పేరులు యవనుల పేరులంబోలి యుండనందున పహ్లవులుగానే భావింపబడుచున్నారు. అయినను దరువాత వచ్చినవారు హిందువుల సంస్కృత నామములను బెట్టుకొని హిందువుల మతములను హిందువుల యాచారముల నవలంబించి మతాచార విషయములయందు హిందువులకంటెను బట్టుదలతో వ్యవహరించిరి. ఆ కారణముచేత నీ మ్లేచ్ఛ జాతుల వారెల్లరును హిందూజాతులలో మగ్నులైపోయిరి. ఇట్లు విదేశస్థులయిన యవనపహ్లవశకునులు తండోప తండములుగా దేశములో జొఱబడి దేశస్థులగుటచేత నాంధ్రరాజులకు బరిపాలనము కష్టసాధ్యముగ నుండెను. మాండలకుడు మొదలగు రాజులు మ్లేచ్ఛులతో బోరాడి యదరంగములవలె వచ్చుచుండెడి మ్లేచ్ఛసమూహములను నిలుపజాలకపోయిరి. కొంతకాలమాంధ్రదేశముయొక్క పశ్చిమ భాగము (ఇప్పటి మహారాష్ట్రదేశము) అరాజకమైయుండెను. పూర్వభాగమున గూడ పహ్లవులు జొఱబడి రాజధాని సమీపమున జేరి తొందరలు కలిగించుచున్నను శివస్వాతియను రాజు రాజ్యభారమును పూనిన తరువాత నల్లరులనడంచి పరిపాలింపసాగెను గాని పశ్చిమభాగమున మాత్రము తన యధికారమును ప్రతాపమును జూపి యరాజకత్వమునుబాపి వశపఱచుకొని పరిపాలించుటకు సావకాశము చిక్కకపోయెను.