పుట:Andhrula Charitramu Part-1.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ససంఖ్యతో చరిత్రములందు వారలను బ్రశంసింపుచు వ్రాయుచుండుటలేదా? ఒక దేశపు రాజులలో నొక పేరునే పెక్కండ్రు వహించినంత మాత్రముచేత నా రాజులవంశమును హెన్రీవంశముగాని చార్లెసు వంశమని కాని, జార్జి వంశముని కాని, ఎడ్వర్డు వంశముగాని చెప్పుచుండుట లేదు. అట్లే యిచ్చటను శాతకర్ణియను పేరుగల వారు పెక్కండ్రు పరిపాలించినను గౌరవార్థముగ శాతకర్ణియను పేరును తమ నామముల కడను కొందఱు ధరించినను మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి మూడవ శాతకర్ణియను చెప్పుకొనవలయునే గాని శాతవాహన వంశమన్నట్లు శాతకర్ణి వంశమని తలంపరాదు. [1] శాతకర్ణియను పేరు పురాణాది సంస్కృత గ్రంథములంగానంబడుచున్నను శతకర్ణియను పేరు సరియైనదయినట్లుగా గన్పట్టుచున్నది. గోతమి పుత్ర శాతకర్ణికి సమకాలీనుడగు "చెంకుడ్డువాన్ చేర" యను చేరరాజునకు సోదరుడగు "ఇల్లంకొ ఆడికాల్" " నూఱువార్ కన్నార్" అని పేరిడియున్నాడు. [2] అనగా నూఱుగురు కర్ణులని యర్థము. అట్లయిన యెడల నయ్యది శతకర్ణియను పేరునకు సరిపోవుచున్నది గాని శాతకర్ణియను పేరునకు సరిపోవుచుండలేదు.

సమకాలీనుడగు కవివ్రాసిన "శతకర్ణి" యను పేరును ద్రోసివేయుటకు నాంధ్రరాజులకు బహుకాలమునకు వెనుకబుట్టిన పురాణములలో శాతకర్ణియని వ్రాయబడియుండుట యొక్కటియే యాధారముగానున్నది కాని వేఱొండుగానరాదు. శతకర్ణుడనగా నూఱు కర్ణములు గలవాడు. అనగా రాజ్యాంగ విషయములను నూఱుచెవులతో వినుచు దక్షతతో బరిపాలించువాడని అర్థము.

  1. Dr. R.G.Bhandarkar's article, June, 1909. The Indian Review Vol.X. no.6;
  2. The Tamils :- Eighteen Hundred years ago.