లలో రెండవవాడుగా బేర్కొనబడిన కృష్ణునిపేరుదాహరించిన శాసనము నాసిక పట్టణ సమీపమునందలి గుహలో గన్పడినప్పుడును, ఆతడు శాతవాహన వంశములోని వాడని చెప్పినప్పుడును, అతనికి బూర్వుడగు శ్రీముఖునిపేరు గూడ శాసనములలో గూడ గన్పడినప్పుడును, ఏల యొప్పుకొనరాదు? ఒప్పుకొన్న పక్షమున నాంధ్రులు గంగాతీరమునుండి ప్రథమ శతాబ్దమున వచ్చిరని చెప్పిన తమ వాదమునకు భంగమును కలిగించునది గాన వారేలయొప్పుకొందురు? శాసనములోనుదాహరింపబడిన కృష్ణరాజు శాతవాహన వంశజుడేయైన యెడల గడపటివారిలో వాడయి యుండునుగాని మొదటి కృష్ణుడు మాత్రము కాజాలాడట? ఇదియంతయును తమ వాదమును నిలువబెట్టుకొనుటకై చెప్పెడు మాటలు గావున వానిని విశ్వసింపరాదని మా యభిప్రాయము.
శ్రీ శాతకర్ణి.
(క్రీ.పూ. 40 మొదలుకొని క్రీ.త.16 వఱకు.)
కృష్ణుని తరువాత శ్రీ శాతకర్ణి రాజ్యాభిషిక్తుడయ్యెనని వాయువిష్ణుభాగవత పురాణములు పేర్కొనుచున్నవిగాని మత్స్యపురాణము మాత్రము కృష్ణుని తరువాత శ్రీమల్లకర్ణియు, పూర్ణోత్సంగుడును, స్కంద స్తంబియునను ముగ్గురురాజులను పేర్కొనుచున్నది. శ్రీశాతకర్ణి తరువాత విష్ణుపురాణము పూర్ణోత్సంగుని మాత్రము పేర్కొనుచున్నది. శాతకర్ణుని శాంతకర్ణునిగను, పూర్ణోత్సంగుని పౌర్ణమాస్యునిగను మార్చి భాగవత పురాణము శాంతకర్ణుని తరువాత పౌర్ణమాస్యుని బెట్టుచున్నది. ఈ నాల్గయిదు పురాణములును పేరులను తికమకలుచేసి యిచ్చవచ్చినట్లు వాడియుండుటచేత కాలనిర్ణయము చేయుట సాధ్యముకాదు. రాజుల పేరులను యువరాజుల పేరులను రాజప్రతినిధుల పేరులను విచ్చలవిడిగా వాడియుండుటచేత నిజముగా రాజులుగానున్న వారెవ్వరో చెప్పుటకు శాసనములు దక్క వేఱుగ నాధారము గాన్పింపదు. కాబట్టి శాసనములతో సరిపోవు వారి పేరులు మాత్రమె రాజులుగా బరిగణింపబడుచున్నవి.