పుట:Andhrula Charitramu Part-1.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పించి ధాన్యకటకమును రాజధానికగ జేసికొని బహుకాలము పాలించిరనియు, వీరు గంగాతీరమున బ్రప్రథమమున నివసించిన ప్రదేశము "మాల్భూమి (మాలభూమి)" నుండి వచ్చిన వారగుటచేతనే పంచమజాతివారికి మాలలను పేరు నిలిచియున్నదనియు, ఆంధ్రభృత్యరాజులలో గోతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లియగు గోతమియు, గోతమి పుత్ర శాతకర్ణి భార్యయగు వాసిష్ఠయు సుప్రసిద్ధులయిన రాణులు గావున వారిపట్ల గల గౌరవాతిశయముచేత గోదావరి మండలములోని గోదావరి నది యొక్క ముఖ్యములయిన రెండు శాఖలకు గౌతమియనియు, వాసిష్ఠయనియు వారి పేరులే పెట్టబడెనవనియు, అశోకుని కాలమునందు వీరు గంగాతీరమున నుండుటచేత నా కాలమునాటి లిపి వీరికి దెలిసియే యున్నదిగనుక వీరిచ్చటికి వచ్చినపుడు వీరి శాసనములయందాలిపినే వాడుచు వచ్చిరని శాసనములు దెలుపుచున్నవనియు వ్రాసియున్నారు.

వీరి వాదము భ్రమైకమూలమైనదిగాని సహేతుకమైనది కాదు. అశోకుని కాలమునకు బూర్వమె కాళింగులు మహానదికిని గోదావరికి నడుమనుండు దేశమున నున్నవారుగాని గంగానదీ ముఖద్వార ప్రదేశముననున్నట్లు ప్రమాణము గానరాదు. అశోకుడు క్రీ.పూ.261వ సంవత్సరమున గాళింగులను జయించి వారి దేశము నాక్రమించియు గాళింగులకు దాను గలిగించిన క్షోభమునకు పశ్చాత్తప్తుడై కాళింగులయెడలను, సరిహద్దుల నుండెడు తదితర జాతుయెడలను సౌహార్ధ్ర భావము గలిగియుండి మహామాత్రులనంబడెడు రాజకీయాధికారులు వర్తింపవలసిన విధులను గుఱించి భువనేశ్వరమునకు సమీపమున "ధౌళి"యను ప్రదేశమునందును, గంజామునకు బడమట జౌగడాయను ప్రదేశమునందును శాసనములను వ్రాయించెను. [1] గంగానదీ ముఖద్వారమునందే

  1. Indian Antiquary Vol.V. The Kalinga Edicts, pp.82-102; Dr.Buhler's Translations in Burgess's Amaravati, pp.125-131; Rulers of India Series - Asoka. pp.134-138. Mr.Smith's Early History of India, p.156. See also the map of the Empire of Asoka in the same book.