"1. రాయసిముక సాతవాహనో; 2. దేవినాయనికాయ రాణ్ణోచసిరి సాతకానీనో; 3.కుమారోభాయా; 4.మహారాణిగా నాకాయిరో; 5. కుమారోహాకుసిరి; 6.కుమారోసాతవాహనో;"వీనిలో మొదట బేర్కొనబడిన రాయసిముక యను పేరును అమరావతీస్తూపములోని "రాణోసిరిసివమక" యను పేరును నొక్కని పేరులేయై యుండవచ్చునని డాక్టరు హల్ ట్ జ్ గారు చెప్పినది సముచితముగానున్నది. సిముక, సినమక శబ్దములు శ్రీముఖ శబ్దము యొక్క ప్రాకృతరూపములగాని వేఱొండుగావు. కాబట్టి యీ పై నుదాహరించిన ప్రమాణములను బట్టి యాంధ్రభృత్యవంశమునందు శ్రీముఖుడను రాజుగలడనియు, అతడు ధాన్యకటకమును రాజధానిగ జేసికొని యాంధ్రదేశమును బాలించుచుండెననియు, అతడే మగధదేశముపై దండెత్తి కాణ్వాయనులను శుంగులను జయించి రాజ్యమును గైకొనియెననియు నిస్సంశయముగా విస్పష్టముగా జెప్పవచ్చును. ఇంకొక విశేషముగలదు. శ్రీముఖశాతవాహనుండని చెప్పబడియుండుటచేత నితడు తప్పక శాతవాహన వంశజుడని చెప్పకయె చెప్పుచున్నది. మొదటి శాతవాహనునకును ఈ శ్రీముఖ శాతవాహనునకును నడుమ రాజులెందఱో కొందఱుండియుండక తీఱదని శ్రీముఖశాతవాహనుడను పేరే వేనోళ్ళ ఘోషించుచున్నది. కనుకనితడు శాతవాహన వంశమునకు మూలపురుషుడు కాడు. పూర్వప్రకరణము నందు మేము సూచించినట్లుగా సాతవాహనుడే శాతవాహన వంశమునకు మూలపురుషుడై యున్నాడు. శ్రీముఖుడు 23 సంవత్సరముల పరిపాలనము చేసియున్నట్లు వాయుమత్స్యపురాణములలో బేర్కొనబడియుండెనుగావున క్రీ.పూ.50వ సంవత్సరము వరకును బరిపాలనము చేసియుండవచ్చును.
కృష్ణశాతవాహనుడు.
(క్రీ.పూ. 50 మొదలుకొని 40 వఱకు.)
శ్రీముఖుని తరువాత రాజ్యాధిపత్యము వహించినవాడు కృష్ణుడని పురాణములన్నియు భిన్నాభిప్రాయములు లేక యైక కంఠ్యముగా బేర్కొనుచున్న