Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(శ్రీముఖుడు)] పెఱికివేసెనని వాయుపురాణమునందు చెప్పియుండుటచేత శృంగవంశజులు బలహీనులయినందున కాణ్వాయన ద్విజు లిటీవలినవీన కాలమునందలి పీష్వాలవలె బేరునకు శుంగరాజుల గద్దెపై నుంచి సర్వాధికారమును దాముపూని పరిపాలించుచుండిరనియూహించినది యుక్తియుక్తముగానె గన్పట్టుచున్నదిగాని యాక్షేపణీయముగగన్పట్టదు. ఇంతియగాక కాణ్వాయనులు బ్రాహ్మణులగుటచేత వారు కేవలము రాజ్యాధిపత్యము వహించి పాలించిరని చెప్పుట యప్పటి కాచార విరుద్ధముగ గన్పట్టుచున్నది. మఱియు పురాణములయందిట్లు చెప్పినది యీ కాణ్వ వంశమునుగూర్చియేకాని మఱియే వంశమును గూర్చియు జెప్పియుండకపోవుటచేత తప్పక శ్రీముఖుడు క్రీ.పూ.23వ సంవత్సరముననే మగధ రాజ్యమును జయించెననుట హేతుయుక్తముగగన్పట్టుచున్నది. మఱియును శ్రీముఖుడు కల్పిత పురుషుడుగాడు. వీని పేరుగల శాసనములు రెండుగానంబడుచున్నవి. అందొకటి రాజధానీ నగరమగు ధాన్యకటకములోని స్తూపములోను [1] (అమరావతీస్తూపము) రెండవది పశ్చిమాంధ్రదేశము (మహారాష్ట్రము) లోని నానాఘట్టములోని యొక్క గుహలోను గలవు. [2] అమరావతీ స్తూపములోని శాసనమిట్లున్నది. "Rano Siri-Sivamaka Sadasapaniyagliarlkasaha"అనగా సిరిసివమకరాజు యొక్క వాణీయశాలకు నధికారిగానున్న వానిదాన మనియర్థము. జున్నారునుండి కొంకణమునకు బోవుబాటమీద నుండు నానాఘట్టముయొక్క శిరోభాగమునందు బాటసారులు విశ్రాంతికై తొలువబడిన యొక గుహలో గోడపైన ఆఱువిగ్రహములు చెక్కబడి వానిపైన పేరులు వ్రాయబడియున్నవి. ఆ విగ్రహములిప్పుడు చాలవఱకు శిధిలములైయున్నవిగాని పేరులు మాత్రము నిలిచియున్నవి. ఈ గుహలోనే వేదశ్రీయను రాజుయొక్క శాసనమున్నది.

  1. J.Burgess- The Buddhist sutpas of Amaravathi and Jaggayyapeta p.61.
  2. J.R.A.S. Vol.IV, p.287, Jour Bom. branch Roy. As. soc Vol.XII p.404 and Vol.XIII, p.310, 312.