పుట:Andhrula Charitramu Part-1.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్తము, సీ! ఇదియేమి పాడుకథ!" యని పలికెను. అంత నా శిష్యులు జరిగిన మర్యాద చాలుననుకొని యా పొత్తమును గైకొనివచ్చినవారు వచ్చినట్లే పోయి జరిగినది జరిగినట్లు తమ గురువర్యునకు దెలిపిరి. తనకు జరిగిన యవమానమునకు గుణాఢ్య పండితుడు మిక్కిలి ఖేదపడియెను.

గుణాఢ్యుడు బృహత్కథను తగలంబెట్టుట.

తరువాత గుణాఢ్యుడు కొంతదూరమున నుండిన యొక పర్వతమునకు శిష్యవర్గముతో బోయి యేకాంతమైన రమ్యప్రదేశమునందు నగ్నికుండమును గావించి కూర్చుండి తన శిష్యులు కన్నీళ్లతో వీక్షించుచుండగా ఒక్కొక్క యాకుగా చదివి మృగములకును పక్షులకును వినిపించి తన శిష్యులకొఱకు ప్రియమైన లక్షగ్రంథాత్మకమయిన నరవాహన దత్తచరిత్రమను కథనుదక్క తక్కిన యాఱు కథలను ఆయగ్ని గుండములో బడవైచి కాల్చివేసెను. అట్లు చదువుచు కాల్చివేయుచుండ సొరంగ వరాహమహిషాది సకల జంతువులు మేతలు మాని కన్నీళ్లు విడుచుచు నిటునటు చలింపక యేకాగ్రముగా వినుచుండినవి.

గుణాఢ్యుడు బృహత్కథను సాతవాహనునకిచ్చుట.

ఇంతలో సాతవాహనుడు స్వస్థుడయ్యెను. అందులకు కారణము నరమాంస భుజనమని వైద్యులు చెప్పిరి. అంతట రాజు వంటవాండ్రను బిలుపించి యదలింపగా వారలు తమకట్టి మాంసమును వేటకాండ్రు తెచ్చియిచ్చిరని పలికిరి. వేటకాండ్రను బిలుపించి యడుగగా "మహాప్రభూ! ఇక్కడ యా పర్వతములో నొక్క బ్రాహ్మణుడొక్కొక్క పత్రమును చదివి నిప్పులో వేయుచుండుటచేత నక్కడకు వచ్చిన సకలప్రాణులును మేతలుమాని వినుచున్నవిగాని యవతలికిపోవు; అందుచేత నాకలివలన వాని మాంసమెండిపోయియున్నది" అని మొఱలెత్తి విన్నవించుకొనిరి. వారి మాటలను విని యతడచ్చెరువు నొంది కుతూహలముచేత స్వయముగా గుణాఢ్యుడున్న చోటికిపోయి శమింపగా మిగిలిన శాపాగ్ని థూమికల చేతనుంబోలె నరణ్యావాసమువలననైన జటలచేత నంతట సమాకీర్ణుడై సభాష్పములైన మృగముల మధ్యనున్న వానిని గుణాఢ్య