కార్యము సిద్ధింపనేరదని ప్రజలు తమలోదాము చెప్పుకొనుచు రాజునకుం గలిగిన యాయద్భుత విద్యాలాభమును విని రాష్ట్రమంతటను మహోత్సవములు చేసిరి. ఇంటింటిమీద వుత్సవంపు జెండాలను వాయుదేవుడు నృత్య మాడించుచుండెను. రాజును శర్వవర్మను గురువుగా భావించి నమస్కరించి రాజార్హములయిన మణికనక వస్త్రాద్యలంకారములతో బూజించి నర్మదాతీరమందలి భరుకచ్చన దేశమునకు (Broach) రాజును చేసెను. సాతవాహనుడు తనకు విద్య లభించుటకు హేతువయిన రాణిని విష్ణుశక్తికూతురిని స్వయముగా పట్టాభిషేకము చేసి పెదరాణులపైన పట్టపుదేవిని గావించెను."ఓ కాణభూతీ! ఇది సాతవాహనుని వృత్తాంతము. హరప్రోక్తమయిన బృహత్కథను నింక నాకుజెప్పుము. మనమిద్దఱమును శాపమోక్షమును పొందుదముగాక" అని గుణాఢ్యుడడిగెను.ఇట్లు గుణాఢ్యుడడుగగా దివ్యమయిన యా మహాకథను ఏడు కథలుగా కాణభూతి తన భాషలోనే చెప్పెను. ఆ గుణాఢ్య పండితుడు మహారణ్యములో సిరా లేకపోవుటచేత విద్యధరులు దానిని హరింపకుందురుగాక యని తన రక్తముతోనే ఏడు సంవత్సరములో ఏడు లక్షల గ్రంథముగా విరచించెను. గుణాఢ్యుడు రచియించిన యా మహాకథను చూచి కాణభూతి శాపవిముక్తుడై దివ్యగతిని పొందెను. వానితోనున్న పిశాచములితరములయినవి సహితమాదివ్యకథను విని స్వర్గమునకు బోయినవి.
బృహత్కథను భూమిపై వ్యాపింపజేయబూనుట.
ఈ బృహత్కథను భూలోకములో స్థాపింపదలంచి శిష్యుల ప్రోత్సాహముచేత గుణాఢ్యుడు రసికుడయిన సాతవాహనుడొక్కడే యీ కావ్యమును గైకొనదగినవాడని తన శిష్యులయిన గుణదేవ నందిదేవుల కాపుస్తకము నిచ్చి సాతవాహనునొద్దకు బంపించెను. వారును సాతవాహన మహారాజును దర్శించి గుణాఢ్యుడు రచించిన బృహత్కథయనెడి గ్రంథమిదియని యాతనికి నివేదించిరి. వారు పిశాచ రూపులుగను గ్రంథము యొక్క భాష పిశాచభాషగను గన్పట్టుటచేత నసూయతగాంచి "ఏడు లక్షలు పరిమితి; భాష నీరసమైన పైశాచి; సిరా