పుట:Andhrula Charitramu Part-1.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని పలికితిని. శర్వవర్మ నా పలుకులను విని యీర్ష్యచేత "సుఖార్హుడయిన ప్రభువింతకాలమెట్లు విద్యాభ్యాస క్లేశముననుభవింపగలడు? ఓ మహాప్రభూ! నేను నిన్నాఱుమాసములలో పండితునిగా నొనర్చెదను" అని గరువముతో బలికెను. ఈ యసంభావ్యవచనమును విన్నతోడనే నాకు రోషమువచ్చి ఇట్లు ప్రతిజ్ఞ చేసితిని.

గుణాఢ్య శర్వవర్మలు ప్రతిజ్ఞ చేయుట.

"ఆఱుమాసములలో నీవే గనుక ప్రభువునకు పాండిత్యము గలుగజేయుదువేని నేను మనుష్య వ్యవహారములో నుండెడు సంస్కృత, ప్రాకృత దేశ భాషల మూడింటిని త్యజించినాడనని తెలిసికొనుము" ఈనా ప్రతిజ్ఞ విని శర్వవర్మ "నేను గనుక నా మాట ప్రకారము చేయలేకపోతినా ద్వాదశవత్సరములు నీ పాదరక్షలను నెత్తిమీద పెట్టుకొని మోసెదను" అని ప్రతి ప్రతిజ్ఞచేసెను. ఇట్లురివురము ప్రతిజ్ఞలు చేసి మా యిండ్లకు బోయితిమి. మా ప్రతిజ్ఞల మూలమున స్వల్పకాలములో దన కోరిక సిద్ధించునని రాజు తలంచి యూఱడిల్లియుండెను.

శర్వవర్మ సాతవాహనుని విద్వాంసుని జేయుట.

అటు తరువాత శర్వవర్మ తానుజేసిన యసాధ్య ప్రతిజ్ఞను దలంచుకొని దిగులుపడి పశ్చాత్తాపము పొంది తన కడగండ్లను పెండ్లాముతో జెప్పుకొని విచారింపసాగెను. ఆమెయు మిక్కిలి చింతించి "నాథా! మనము చింతించిన ప్రయోజనము లేదు; ఈ యపాయమునుండి మనల దప్పింప నొక్క కుమారస్వామి దక్క వేఱెవ్వరును లేరు" అని చెప్పెను. అంతట శర్వవర్మయు నదే నిశ్చయము చేసి కుమారస్వామిగుడికి బోయి వాయుమాత్రభక్షకుడై మౌనముదాల్చి దృఢనిశ్చయముతో తపస్సుచేసి యా దేవుని మెప్పించెను. అంతట కుమారదేవుడు వానికి ప్రసన్నుడై కోరిన వరంబులొసంగి యంతర్హితుడయ్యెను. శర్వవర్మయు కుమారస్వామి వరముచేత సిద్ధిమంతుడై వచ్చి తలంపు మాత్రముచేతనే సాతవాహనుని విద్యావిశారదుని గావించెను. పరమేశ్వరుని యనుగ్రహమునుండిన నేయసాధ్య