పుట:Andhrula Charitramu Part-1.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పణముచేతనే యాంధ్రులు బౌద్ధమతమవలంబించిరని యతడు వ్రాయించిన పదమూడవ శిలాశాసనము వలన గన్పట్టుచున్నదని మూడవ ప్రకరణమునందే యా శాసనములోని వాక్యములను దెలిపియుంటిమి. ఆంధ్రరాజ్యమీచక్రవర్తి కాలమున నిప్పటి బ్రిటీషు ప్రభుత్వమునకు లోబడియున్న హైదరాబాదు, మైసూరు, బరోడా రాజ్యముల వలెనొక సంరక్షక రాజ్యముగ నుండియుండవలయును. [1] ఇప్పటి యాంధ్ర దేశభాగమగు కళింగము (గోదావరి, విశాఖపట్టణము, గంజాము జిల్లాలు) పై దండెత్తి వచ్చి స్వాధీనము చేసికొని యుద్ధమునందు లక్షమంది కాళింగులు మడియుటయును, ప్రజలకు గలిగిన సంక్షోభమును గన్నులార గాంచి పశ్చాత్తప్తుడై యంతటినుండి యుద్ధముల మానివేసి బుద్ధ ధర్మమునవలంబించి బోధకుల నానాదేశములకు బంపించి బౌద్ధమతమును నానాముఖముల విస్తరింపజేసిన వాడశోకుడు. వీని మరణానంతర మాంధ్రులు స్వతంత్రులయి పరిపాలనము చేసినట్లుగ గన్పట్టుచున్నది. అశోకవర్ధనుని తరువాత పాలించిన మౌర్యవంశపు రాజులలో నశోకుని మనమడు దశరథుడను వాడు తక్క తక్కినవారెల్లరును నట్టి బలహీనులగుటవలన సామంతులుగనున్న వారనేకులు స్వతంత్రులయిరి.
ఆంధ్రరాజ్యమును స్వతంత్రత వహించుటయె గాక భరతఖండము యొక్క మధ్యభాగమునంతయు నాక్రమించుకొని తన యధికారమును నలుప్రక్కల విజృంభింపజేయుచుండెను. మౌర్యవంశపు రాజులలో గడపటివాడయిన బృహద్రథుని కాలమున వాని సైన్యాధిపతియు, శుంగవంశ సంజాతుడునగు పుష్యమిత్రుడను వాడు వానిం జంపి క్రీ.పూ.184వ సంవత్సరమున రాజ్యమాక్రమించుకొనెను. ఇతడు బహుపరాక్రమవంతుడై యశ్వమేధాది యాగముల బెక్కింటిని జేసెనుగాని యాంధ్రులును కాళింగులు నీతనికి లోబడియున్నట్లు గానరాదు.

  1. Ind. Ant. Vol xx. 247. Mr.V.A.Smith's Early History of India, p.151. The Godavary Dist. Gazetteer, p.17