పుట:Andhrula Charitramu Part-1.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవునికారోపింపబడు గాథలనన్నిటిని పరిశోధించి చూచిన యెడల నీతడొక శూరాగ్రేసరుడయిన రాజనియు, మరణానంతర మొక దేవుడుగా భావింపబడి శూరులచే గొలువబడుచుండెనని తేటపడకమానదు. ఇతడు గంగానది పుట్టినచోట సారవనమునందు జనించి యార్గురుతల్లులచే బెంపబడియెననియు జెప్పుదురు. అసురులతో బోరాడునపు డితడు దేవతలకు సేనాధిపతిగనుండెను.

ఆ కాలమున బ్రాహ్మణార్యుల మతమును, వారి నిత్యనైమిత్తిక కామ్యకర్మలును అనార్యులచే నేవగింపబడుచుండినయవి. వారి గ్రంథవిజ్ఞానమును వీరికి లభింపకపోయెను. తుదకు బ్రాహ్మణార్యులే యనార్యులను వశపఱచుకొనుటకై యనార్యుల దేవతలను గ్రహించి యాదరించి పూజింపసాగిరి. నాగుల దేవతయగు కాళిని శివుని భార్యయగు పార్వతియొక్క యంశమనిరి. వేటకాండ్ర దేవతయగు "మురుగ"ను స్కందకుమారుడనియు షణ్ముఖుడనియు, కుమారస్వామియనియు, పేరుపెట్టి శివునికుమారునిజేసిరి. దేశవీరులయిన బలరామకృష్ణులు గొల్లవాండ్రచే బూజింపబడుచుండిరి. వీరిని విష్ణుని యవతారములని గ్రహించిరి. అనార్యులను సంతోషపెట్టుటకై మొదటనార్యులీ దేవతలకు దేవాలయములు గట్టి ముఖ్యముగా నా కాలమున శివుని, షణ్ముఖుని, బలరామకృష్ణులను బూజింపసాగిరి. ఆ కాలమునందలి ప్రధాన దైవతములలో శివుడే ప్రధాన దేవుడుగా నుండెను. [1] ఈ శైవమత మార్యజాతులలోగంటె ననార్యజాతులలో సంపూర్ణముగా వ్యాపించియుండెను. ఆంధ్రరాజ్యమునకు సింహళమునకును యక్షరాజ్యములగు పాండ్య చోళ చేర రాజ్యములకును వర్తకవ్యాపా

  1. శైవమతమును గూర్చిన పై యంశములు క్రీస్తు శకము రెండవ శతాబ్దారంభమునను మధ్యమునను రచింపబడిన చీలప్పదికారము, తిరుమురుక్కరుపడై యను తమిళకావ్యములయందు జెప్పబడినవిగాని నా స్వకపోల కల్పితములు గావు.
    See "The Tamils:Eighteen Hundred Years Ago" by Mr.V.Kanakasabhai. pp.227-233.