పుట:Andhrula Charitramu Part-1.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మును దాల్చి రాగివర్ణపు వెండ్రుకలతోడి జటాజూటము కలవాడై పులితోలుగప్పుకొని శూలపాణియై, వృషభవాహనారూఢుడై, త్రినేత్రములను గలిగి సంచరించునని యక్షులభివర్ణించి యుండిరి. త్రినేత్రములు దక్కతక్కిన రూపమంతయు హిమవత్పర్వత ప్రాంతభూమిని నివసించు నాదిమనివాసుని రూపమును బోలియుండుననుటకు లేశమాత్రమును సంశయములేదు. ఆయున్నత భూములందుండు పార్వతీయులు స్ఫురద్రూపులుగాను రాగివర్ణపు వెండ్రుకలు గలవారుగను ఎద్దులనెక్కి సంచరించువారుగ నుందురు. హిమాలయపర్వతమునందుత్తర భాగమును గంగాసింధు బ్రహ్మపుత్రానదుల జన్మస్థానమునకు సామీప్యముననుండి వెండికొండవలె మంచుగడ్డలతో బేర్చబడియున్న కైలాసశిఖరమీతని నివాసముగనుండెను. స్వర్గభూమియందుండెడి దేవతలకు (the inhabitants of the highest table land of the earth, ie., Tibet. భూమండలమునందలి యున్నతభూములలో నున్నతమైనది అనగా త్రివిష్టప్రదేశము -Tibet)బాధ కలుగజేయుచుండిన యసురుల సంహరించి వారి త్రిపురములను భస్మముచేసి త్రిపురాసుర సంహారకుడని బిరుదుగాంచుట యీతడు చేసిన ఘనకార్యములలో నొక్కటిగానున్నది. ఈతడు హిమవంతుని కూతురగు పార్వతిని వివాహము చేసికొనియెను. యక్షులలో వీరులకును వేటకాండ్రకును, "మురుగ" యను మఱియొక దేవత (స్కందుడు లేక కుమారస్వామి) కలడు. స్కందునకాఱు మొగములును, పండ్రెండు చేతులును గలవు. ఈ దేవుని దేవాలయములరణ్యముల నడుమను, పర్వతముల శిఖరముల మీదను సాధారణముగా నిర్మింపబడుచుండెను. ఈ దేవతకు బలులర్పింపబడునప్పుడొక పాకవేయబడి పూలసరములతో నలంకరింపబడును. అచ్చట వేటకాండ్రయొక్క గురువు మంత్రోచ్చారణ సలుపుచు, పుష్పములను, అక్షతలను వెదజల్లుచు నొక యెద్దును బలియిచ్చును. ఆ యెద్దు రక్తములో వేడియన్నము గలిపి తప్పెటలును డోళ్ళును మ్రోగుచుండగా చేగంటలు వాయించుచుండగా, కొమ్ములూదుచుండగా ఆ ప్రసాదమును దేవునకు నైవేద్యమిడును. తరువాత వారందఱు నచ్చట కొంతసేపు సివములాడి మఱిపోవుదురు. దీనినంతయును విచారించి చూడగ నితడు కల్పిత పురుషుడని చెప్పరాదు. ఈ