గ దేశమునందలి జనులును నొక్క తెగలోనివారుగ గన్పట్టుచున్నారు. కళింగదేశమునందు ప్రసిద్ధములయిన రెండు రేవుపట్టణములు గలవని చీనా బర్మాదేశస్థులు వ్రాసిన చరిత్రము వలన దెలియుచున్నది. మఱియు ఉత్తర పినాకినీ నదీ ముఖద్వారమున నొక రేవుపట్టణముండినట్లుగ బౌద్ధుల గాథలయందు దెల్పబడియున్నది. బుద్ధుని శిష్యుడగు పూర్ణుడను బ్రాహ్మణుని సోదరుడొకడు మూడు వందల జనులతో సూర్పరాక పట్టణమునుండి (పశ్చిమతీరమునందలి కొంకణదేశము లోనిది) యోడనెక్కి లంకాద్వీపమును జుట్టివచ్చి పై జెప్పిన ఉత్తర పినాకినీ ముఖద్వారమునందలి రేవుపట్టణము కడ దిగెనని బౌద్ధులగాథలవలన దెలియుచున్నది. బుద్ధుని కాలమునందాంధ్రదేశమిట్టి నారగికతా చిహ్నములను వహించియుండినను దేశము విశేషభాగమరణ్యభూమిగానే యుండెనని చెప్పవలసియున్నది. ఇంతకన్న బుద్ధునికాలమునందాంధ్రదేశమును గూర్చిన చారిత్రము సవిస్తరముగా దెలియరాదు.
బోధయనాపస్తంబుల కాలము
(క్రీ.పూ. 477 మొదలుకొని 323 వఱకు)
సూత్రమనగా విశేషార్థమును సంక్షేపముగా జెప్పెడి చిన్నవాక్యము. ఈ కల్పసూత్రములు శ్రౌతసూత్రములనియును, గృహ్యసూత్రములనియును, ధర్మసూత్రములనియును మూడు విధములుగానున్నవి. ఒక్కొక్క వేదమునకు బ్రాహ్మణములు పెక్కులున్నట్లుగానొక్కొక్క వేదమునకు సూత్రములుగూడ పెక్కులుగలవు. ఆర్యులొకదేశమునుండి మఱియొక దేశమునకు బోవుచువచ్చిన కొలది నాయా దేశస్థితులనుబట్టి యార్యాచారములుగూడ మాఱుచువచ్చెను. ఇందువలన భిన్నసూత్రములును భిన్నశాఖలును గలిగెను. యజ్ఞయాగాదిక శ్రౌతకర్మలజేయు విధానము శ్రౌతసూత్రములయందును గృహస్థులాచరింపవలసిన షోడశకర్మాదులను జేయవలసిన విధానము గృహ్యసూత్రములయందును వ్యవహారధర్మాచరణ విధానము ధర్మసూత్రములయందును జెప్పబడినవి. ప్రాచీనసూత్రకారులలో బోధాయనాపస్తంబు లిరువురును దక్షిణాపథములోనివారుగ గన్పట్టుచున్నారు. వారిలో ముఖ్యముగా నాపస్తంబుడాంధ్రదేశములోని వాడగుట