ఈ పుట ఆమోదించబడ్డది
చేతనే యైతరేయ బ్రాహ్మణమునందాంధ్రులు కిరాత జాతులతో జేర్పబడియున్నారు. అటు పిమ్మట నాగరాజులు కొందఱుత్తర దేశమున నార్యులతో బోరాడి దక్షిణమునకు వచ్చి దండకారణ్య ప్రదేశమున సురక్షితములయిన స్థానములనేర్పఱచుకొని తమ రాజ్యమును విస్తరింప జేసియుందురు. వీరినే మన్వాది స్మృతికర్తలు యవనులు, చీనులు, పహ్లవులు, కిరాతులు మొదలగు వారితో జేర్చి తఱమబడిన క్షత్రియు (ద్రావిడులు)లని పేర్కొని యుందురు. ఈ యభిప్రాయమే సరియైనదైనపక్షమున నాంధ్రులను ద్రావిడులనుట యొప్పును. కాబట్టి మొదట దండకారణ్యమును బ్రవేశించినవారాంధ్ర ద్రావిడులనుటకు సందియము లేదు. వీరలిప్పటికి రెండు వేల యేనూఱు సంవత్సరముల నాడాంధ్ర రాజ్యమును స్థాపించిరనుటకు సంకోచింప నక్కరలేదు.