Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ను రెండు ద్రోణములను సంపాదించి వానిని వజ్రాలదిన్నెకడ (Diamonds Sands)బాతిపెట్టి పైననందమైనట్టియు, అమూల్యమైనట్టియు స్తూపమునొకదానిని నిర్మించిరని చెప్పబడినది. ఈ బొమికెల భాగము మొట్టమొదట కపిలవస్తు నగర సమీపమునందలి రామగ్రామములోనిది. రామగ్రామములోని స్తూపము వఱదకు గొట్టుకొని పోబడినప్పుడీ బొమికెల పెట్టె గంగానదిలోబడి కొట్టుకొనిపోయి సముద్రములోబడగా నాగులు దానిని బట్టుకొని మంజీరికాయను తమ దేశమునకు గొనిపోయిరి. ఈ మంజీరికాదేశము [1] కళింగదేశమునకు రాజధానియగు దంతపురమునకు దక్షిణముననున్నది. ఎందుకన రాజపుత్రుడగు దంతకుమారుడును రాజపుత్రికయగు హేమవలయు బుద్ధుని దంతముతో నోడనెక్కి దంతపురమునుండి సింహళద్వీపమునకు బాఱిపోవునపుడు వజ్రాలదిన్నె (Diamonds Sands)కడ నోడ మెట్టజిక్కెనని చెప్పబడినది. ధరణికోటకు నుత్తరమున వజ్రములకు బురాతనకాలము నుండి ప్రసిద్ధి వహించినదగుటచే వజ్రాలదిన్నె (Diamonds Sands) యనునది యా ప్రదేశమె యగుననియూహింపబడుచున్నది. [2]ఈ దంతపుర కథనము క్రీస్తు శకము నాలుగవ శతాబ్ద ప్రారంభమున జరిగి యుండెనని సయాము దేశ గ్రంథమువలన గన్పట్టుచున్నది గాని మహావంశమునందు క్రీస్తునకు బూర్వము నూటయేబది యేండ్ల కిందట జరిగినట్లుగ జెప్పబడున్నుది. తరువాత సింహళరాజు మంజీరికా దేశమునకు బోయి యా బొమికెల పెట్టెను దెమ్మని పరిశుద్ధుడైన మతాచార్యునినొక్కనిబంపెను. ఇయ్యది నాగులకంతగా నిష్టములేకపోయినను నత్యద్భుతముగా నది యెట్లో యా మతాచార్యుని వశమయ్యెను. ఈ నాగరాజునకు సింహళరాజు మిత్రుడగుటవలన సింహళరాజు నాగరాజునకు కొన్ని బొమికలనిచ్చి సంతోషపెట్టెను.

  1. ఈ మంజీరికా దేశము మంజీర దేశమని బౌద్ధుల చేతను, ఆంధ్రదేశమని యార్యులచేతను ఆ కాలమున బిలువబడుచువచ్చెను. మంజీరయను పేరుగల యుపనది యొక్కటి గోదావరిలో గలియుచున్నది.
  2. Major General. A.Cummingham's Ancient Geography of India p.534